JAISW News Telugu

Weather Report : ఐఎండీ శుభవార్త.. నేడు కేరళను తాకనున్న రుతుపవనాలు

Weather Report

Weather Report

Weather Report : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 52.3డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు వడగాలులు, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మే 30-31 మధ్య ఎప్పుడైనా రుతుపవనాలు భారత సరిహద్దులోకి ప్రవేశిస్తాయని తెలిపింది. అంటే రాబోవు 24 గంటల్లో రుతుపవనాలు కేరళకు తాకనున్నాయి. రాబోయే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది. ఈసారి రుతుపవనాలు కేరళలో ప్రతిసారి కంటే ముందు గానే  ప్రవేశిస్తున్నాయి. ఇక, వచ్చే 3-4 రోజుల్లో వాయువ్య, మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీల వరకు క్రమంగా తగ్గే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో రెడ్ అలర్ట్… దాంతో పాటు మరో మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అంతేగాక, కేరళతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కర్ణాటక, ఏపీ, అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు జూన్ 5 వరకు చేరనున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ ఎగువ భాగం, పశ్చిమ బెంగాల్‌కు జూన్ 10వరకు చేరుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.  

గతేడాది జూన్ 8న రుతుపవనాలు ఒక వారం ఆలస్యంగా తాకాయి. వాతావరణ శాఖ ప్రకారం.. కేరళలో సాధారణ రుతుపవనాలు జూన్ 1న ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అది ఉత్తరం వైపుగా, జూలై 15 నాటికి దేశంలో మిగతా ప్రాంతాలకు విస్తరిస్తాయి. సాధారణంగా  రుతుపవనాలు ఈశాన్య భారతదేశంలో జూన్ 5 నాటికి ఎంటర్ అవుతాయి. కానీ, కొన్ని సంవత్సరాలుగా రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుకుగా ఉందని, రుతుపవనాలు ఈశాన్య భారతదేశం మీదుగా అదే సమయంలో పురోగమిస్తాయంటూ వాతావరణ శాఖ తెలిపింది. “రెమాల్’ తుఫాను కారణంగా రుతుపవనాలతో బంగాళాఖాతం చాలా యాక్టివ్ గా ఉంది. ఇది ఈ ప్రాంతంలో రుతుపవన ప్రవాహాన్ని లాగింది. రెండ్రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో  భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Exit mobile version