Telangana : కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో తెలంగాణ సర్కార్ ను న్యాయస్థానం మందలించింది. పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుందో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ నెల 27వ తేదీ వరకు చెక్కులను పంపిణీ చేయకుంటే ల్యాప్స్ అయ్యే అవకాశం ఉందని, పంపకాలకు అనుమతి ఇప్పించాలని కౌశిక్‌రెడ్డి న్యాయ స్థానాన్ని వేడుకున్నారు. కౌశిక్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకున్నారని అధికారులను ప్రశ్నించింది.
చెక్కుల పంపిణీలో జాప్యం ఎక్కడ జరుగుతుందో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రాష్ట్రం చెల్లించాల్సిన సాయం అందజేస్తామని అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ జస్టిస్ నందాకు వివరించారు.
లబ్ధిదారులకు చెందిన 71 చెక్కులు ఆయా బ్యాంకులకు పంపించామని.. గడువు జూన్ 27 కాదని ఆగస్టుతో ముగుస్తుందన్నారు. ఒక్క చెక్కు కూడా ల్యాప్స్ కాకుండా ప్రభుత్వం జారీ చేసిన జీఓల్లో పేర్కొన్న విధంగా లబ్ధిదారులందరికీ అందేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు.
అయితే, చెక్కుల పంపిణీకి రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేయడం లేదని, రేపటితో (జూన్ 27) గడువు ముగుస్తుందని పిటిషనర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాదనలో వాస్తవం లేదన్నారు.
పూర్తి వివరాలను సమర్పించేందుకు రెండు వారాల గడువు కోరింది. షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీకి సంబంధించిన అన్ని వివరాలను అందించేందుకు ఇమ్రాన్ ఖాన్ వివరణాత్మక కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల సమయం కోరారు.