Sankranti Holidays : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్: సెలవులు పొడగింపుపై కీలక నిర్ణయం
Sankranti Holidays : ఆంధ్రప్రదేశ్ కు సంక్రాంతి అతిపెద్ద పండుగ. తెలంగాణలో బతుకమ్మకు ఉన్నంత ప్రాధాన్యత ఏపీలో సంక్రాంతికి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం మరో మూడు రోజులు పొడిగిస్తూ బుధవారం (జనవరి 17) ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రకటించినట్లుగా గురువారం (జనవరి 18) పాఠశాలలు తెరుచుకోవాలి. కానీ, ఈ సారి సంక్రాంతి సంబురాలు మరింత వైభవంగా నిర్వహిస్తుండడంతో చాలా మంది విద్యార్థులు సొంత ఊళ్లలోనే ఉండిపోయారు. దీంతో ఏపీ విద్యాశాఖ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
వరుసగా 13 రోజులు
ఏపీ ప్రభుత్వం పొడిగించిన సెలవులతో విద్యార్థులకు ఏకంగా 13 రోజులు సెలవులు వచ్చాయి. తెలంగాణలో విద్యా శాఖ జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 6 రోజులు సెలవులు ఇచ్చింది. జూనియర్ కాలేజీలకు 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 4 రోజులు సెలవులను ప్రకటించారు. గురువారం (జనవరి 18న) పాఠశాలలు తెచుకోనున్నాయి. ఏపీలో అయితే ఇంటర్ కాలేజీల సెలవులు జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు 10 రోజులు. జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.
సెలవులు పొడగింపు
గతంలో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గురువారం విద్యా సంస్థలు తెరుచుకోవాలి. కానీ సంక్రాంతి పండగకు ఊళ్లకు వెళ్లిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఇంకా వారు నివసించే ప్రాంతాలకు చేరుకోలేదు. బస్సుల కొరత, పండుగ సంబురం నేపథ్యంలో విద్యార్థులు పట్టణాలకు, హాస్టళ్లకు బుధవారం సాయంత్రం వరకు చేరుకోలేదు. ఒక వేళ గురువారం బయల్దేరినా సాయంత్రానికి గానీ చేరుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం, శనివారంను ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. ఇక ఆదివారంను విడిచిపెడితే.. సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.