Vijayawada-Mumbai : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. విజయవాడ-ముంబై డైలీ ఫ్లయిట్
Vijayawada-Mumbai : విజయవాడ-ముంబై మధ్య ఎయిర్ ఇండియా డైలీ విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ సర్వీసును విజయవాడ విమానాశ్రయంలో శనివారం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించనున్నారు.
ఈ సర్వీసు కోసం బాలశౌరి చాల కాలం నుంచి ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది. శనివారం సాయంత్రం 5.15 గంటలకు ముంబై నుంచి విజయవాడకు ఎయిరిండియా విమానం రానుంది. ఈ విమానం పైకి వాటర్ వెదజల్లి ఇక్కడి సిబ్బంది ఘన స్వాగతం పలుకనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు టెర్మినల్ బిల్డింగ్ లో కేక్ కటింగ్ జరుగుతుంది. అనందర్ం ప్రయాణికులకు ఇద్దరు ఎంపీలు బోర్డింగ్ పాస్ లు అందిస్తారు. మొత్తం 185 మంది సామర్థ్యంతో ఈ విమానం నడుస్తుంది. నెల రోజుల కిందటే ఎయిరిండియా సంస్థ విజయవాడ-ముంబై టికెట్ బుకింగ్ చేపట్టింది. రూ.5,600 ప్రారంభ టికెట్ ధరగా నిర్ణయించారు.
కాగా, విజయవాడ నుంచి ముంబైకి గతంలోనే విమాన సర్వీసు నడిచేది. కానీ, కరోనా సమయంలో రద్దయింది. అయితే, విజయవాడ నుంచి ముంబైకి సర్వీసు నడపాలని ఏపీ చాంబర్స్ విమానాశ్రయ అధికారులకు, ఎయిరిండియాతో పాటు పలు విమానయాన సంస్థలకు, ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. దీనిని ఎయిరిండియా స్వాగతించింది. ప్రతిరోజు రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి విమానం బయలుదేరి రాత్రి 9 గంటల కల్లా ముంబై చేరుతుంది.