Amaravati : అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.25,000 కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)కు అతి త్వరలో మహర్దశ పట్టనుంది. దీనికి ఇప్పటికే అనుమతిచ్చిన కేంద్రం ఈ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించేందుకు వీలుగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఓఆర్‌ఆర్ మొత్తం 189 కిలోమీటర్లు. దీనిని రూ.25 వేల కోట్ల వ్యయంతో నిర్మించేందుకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో ఓఆర్‌ఆర్‌కు కేటాయింపులు చేసే అవకాశాలున్నాయని జాతీయ రహదారి సంస్థ అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్‌లోనే రూ.5 వేల నుంచి 10 వేల కోట్లు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులలో భూ సేకరణ వ్యయం కూడా కేంద్రమే భరించాల్సిందిగా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు.
ఈ పెద్ద ప్రాజెక్టు కోసం రాష్ట్రం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. అవుటర్ రింగ్ రోడ్ ఎక్స్‌ప్రెస్ వే పరిధిలోకి విజయవాడ-మంగళగిరి- గుంటూరు ప్రాంతాలు వస్తాయి. నందిగామ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, తెనాలి, సత్తెనపల్లిని కనెక్ట్ చేస్తూ ఈ ఓఆర్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మితమౌతుంది. 2014లో రాష్ట్ర విభజన చోటు చేసుకున్న తరువాత ఇంత పెద్ద మొత్తంలో రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్టును మంజూరు చేయడం ఇదే తొలిసారి. ఈ మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని బీజేపీకి చెందిన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించారు.
ఏపీ రాజధాని అమరావతిలో లాజిస్టిక్, రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్రప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పురంధేశ్వరి అన్నారు. ఈ క్రమంలోనే రూ.25,000 కోట్ల విలువ చేసే అతిపెద్ద ప్రాజెక్టును అమరావతికి మంజూరు చేశారని తెలిపారు. రహదారుల వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రం బలంగా నమ్ముతోందని, అందుకే తమ పదేళ్ల హయాంలో ఏపీలో లాజిస్టిక్ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు.