BRS KCR : తెలంగాణలో రెండు దశాబ్దాలుగా తన మాటే వేద హక్కుగా హవా కొనసాగించిన మాజీ సీఎం కేసీఆర్ పార్టీ పరంగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా అధికార పార్టీలోకి జంప్ అవుతుండడంతో నాయకులు, శ్రేణుల్లో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీంతో పార్టీలో నూతనోత్సాహం నింపడానికి కేసీఆర్ పూనుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులతో తన ఫామ్ హౌజ్ లో సమావేశాలు నిర్వహిస్తూ వారిలో భరోసా నింపుతున్నారు.
పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయినంత మాత్రాన ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, పార్టీకి మంచి రోజులు వస్తాయని వారిలో ధైర్యం నింపుతున్నారు. పార్టీ మారిన నేతలపై స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని ఈసందర్భంగా పలువురు కేసీఆర్ ను కోరారు. తాజాగా కేసీఆర్ తో ఆయన ఫామ్ హౌజ్ లో మల్లారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి తదితరులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ వారితో మాట్లాడుతూ..పార్టీ తొలినాళ్ల నుంచి ఎన్నో అవహేళనలను ఎదుర్కొంది అని, ఆ తర్వాత తెలంగాణ సాధించడం, పదేళ్లు అధికారంలో ఉండడం.. పార్టీ సాధించిన ఘన విజయాలు అని చెప్పుకొచ్చారు. వైఎస్ హయాంలో పార్టీని లేకుండా చేయలేని ప్రయత్నించినా ఏం చేయలేకపోయారని, ప్రస్తుత ఘటనలతో అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కేసీఆర్ అన్నారు. కనీసం పింఛన్లు అయిన ఇస్తున్నారా? అని నేతలను ఆరా తీశారు. ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ టూర్లు, మంత్రుల సమన్వయ లోపంతో పాలన అటకెక్కడం, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.