Gannavaram Airport : ఏపీలో ఎన్డీఏ కూటమి రావడంతో రాష్ట్రానికి మంచిరోజులు వచ్చినట్టే కనిపిస్తాయి. మొన్ననే ప్రమాణ స్వీకారం చేశారో లేదో..నిన్నటి నుంచి విజయవాడ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి విమాన సర్వీసు ప్రారంభమైంది. దీంతో గంటన్నరలోనే అక్కడకు చేరుకోవచ్చు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి డైరెక్ట్ విమాన సర్వీస్‌లు నడవనున్నాయి.
గన్నవరం నుంచి ముంబైకి కొత్త విమాన సర్వీసును మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(శివనాథ్) శనివారం ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి మొదలయ్యాయని ఎంపీ బాలశౌరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వ హయాంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గన్నవరం నుంచి ముంబైకి ఎయిర్ లైన్స్ సర్వీస్ ప్రారంభించామన్నారు. ఈ విమానం ముంబైలో మధ్యాహ్నం 3.57 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.50 గంటలకు విజయవాడకు చేరుతుందన్నారు. తిరిగి రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9.00 గంటలకు ముంబైలో ల్యాండ్ అవుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు కొత్త విమాన సర్వీసు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
రాజధానికి అంతర్జాతీయ విమానాశ్రయం
ఏపీ రాజధానికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కావాలని.. ఇతర ప్రాంతాలకు కూడా ఎయిర్ లైన్ సర్వీసులు కావాలని బాలశౌరి పేర్కొన్నారు. రాజధానికి కావాల్సిన అన్ని సర్వీసులు త్వరలోనే మొదలవుతాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని విమానాలు రావటానికి తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ముంబై కనెక్టివిటీ ఫ్లైట్ సర్వీసు ప్రయాణికులకు సులభంగా ఉంటుందన్నారు. గతంలో చాలా సార్లు వీటిపై రిక్వెస్టులు పెట్టామన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియాకు ఎంపీ బాలశౌరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని ప్రాంతం కావడంతో ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఫ్లైట్‌లు చాలా ఇబ్బందిగా ఉన్నాయని, దీనిపై కూడా ఇండిగో వారితో చర్చిస్తామన్నారు. కొత్త టెర్మినల్ బిల్డింగ్ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
గన్నవరం నుంచి కోల్ కతా సర్వీసుకు ప్రతిపాదన
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కోల్‌కతాకు విశాఖ మీదుగా విమాన సర్వీసు నడిపే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఎంపీ బాలశౌరి తెలియజేశారు. వారానికి రెండు రోజులు వారణాసి వెళ్లేందుకు కొత్త విమాన సర్వీసు కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమాన సర్వీసును తిరిగి అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే థాయ్‌లాండ్, శ్రీలంక సర్వీసులు.. ఢిల్లీ నుంచి మరో రెండు సర్వీసులు అదనంగా వేసేలా తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామన్నారు. కాంట్రాక్టర్ వల్లే కొత్త టెర్మినల్ నిర్మాణంలో జాప్యం జరిగిందని.. త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
కాగా, ఎంపీ బాలశౌరి చొరవతోనే ముంబైకి సర్వీసులను నడిపేందుకు ఎయిరిండియా ముందుకొచ్చిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఏఐ599 సర్వీసులో 180 సీటింగ్ కెపాసిటీ ఉంటుందన్నారు. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులను కూడా ఈ సర్వీసు ద్వారా ముంబైకి.. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని చిన్ని చెప్పారు.