Gold Smuggling : బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఓ ఎయిర్ హోస్టెస్ అధికారులకు పట్టుబడింది. దేశంలోకి బంగారం అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటున్నప్పటికీ కొందరు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళలో ఓ ఎయిర్ హోస్టెస్ బంగారంను అక్రమంగా తరలిస్తూ అధికారులకు చిక్కింది. నిందితురాలు తన రహస్య అవయవాల్లో కేజీ బంగారాన్ని దాచినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మే 28న మస్కట్ నుంచి కన్నూర్ ఎయిర్ పోర్టుకు ఓ విమానం చేరుకుంది. అందులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ విమానంలో ఎయిర్ హోస్టెస్ గా ఉన్న సురభి ఖాతూన్ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మలద్వారంలో 960 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. ఆమెను కన్నూర్ మహిళా జైలుకు తరలించారు. ఎయిర్ లైన్స్ కు చెందిన సిబ్బంది ఇలా రహస్య భాగాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం దేశంలో ఇదే తొలిసారని డీఆర్ఐ వర్గాలు వెల్లడించాయి.