TTD Laddu : తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఈ వివాదంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ బటర్ ఆయిల్ తో లడ్డూ ప్రసాదం తయారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్ మాల్ జరిగిందని మండిపడ్డారు. టీటీడీ నిబంధనలను పక్కపపెట్టి ట్రేడర్స్ ను తీసుకొచ్చారన్నారు.
ఢిల్లీ నుంచి ఆల్ఫా అనే సంస్థను తిరుమలకు తీసుకు వచ్చారని, ఆ కంపెనీ విదేశాల నుంచి బటర్ ఆయిల్ ను దిగుమతి చేసుకుందని తెలిపారు. బటర్ ఆయిల్ లో గేదె, ఆవు, జంతువుల నెయ్యి కలిసి ఉంటుందని, ఆ బటర్ ఆయిల్ తో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేశారని వెల్లడించారు. ఆవునెయ్యి కాకపోవడంతో లడ్డు నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డి కమీషన్ల కోసం కక్కుర్తిపడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ ధ్వజమెత్తారు.