Monda market temple : మోండా మార్కెట్ సమీపంలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలియడంతో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసే ముందు నిందితుడు ఆలయ గేట్ ను కాలితో తన్ని లోపలికి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఘటన అనంతరం నిందితుడిని స్థానికులు చితకబాదారు. రోడ్డుపై బైఠాయించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలయం వద్దకు చేరుకొని సీపీ సీవీ ఆనంద్ తో కలిసి గుడి లోపలికి వెళ్లి పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కంటెన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఘటనాస్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.