Dhavaleswaram : భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. అక్కడ 53 అడుగులకు నీటిమట్టం పెరగడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 13.90 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 13.06 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది. కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని లంక గ్రామాలను వరదనీరు చుట్టు ముట్టేస్తుండడంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశముంది.
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వరదనీరు వదులుతుండడంతో కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రవహించే గౌతమీ గోదావరి బలయోగి వారధి వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజీవ్ బీచ్ పరివాహ్ ప్రాంతంలో ఉండే పుదుచ్చేరి పర్యాటక శాఖకు చెందిన వాటర్ స్పోర్ట్స్ నీట మునిగింది. మత్స్యకారులు తమ మెకనైజ్డ్ బూట్లు, నావలు, వలలు కొట్టుకుపోకువడా టైడల్ లాక్ వద్దకు చేర్చి తాళ్లతో బంధించారు.