Patnam Narendra Reddy : వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసు ఘటనలో అరెస్టు అయి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డికి చర్లపల్లి జైలులో స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని, ఇంటి భోజనం అనుమతించాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ ను న్యాయస్థానం ఆదేశించింది.
లగచర్లలో పలువురు రైతులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. పోలీసులు గ్రామాల్లోకి వచ్చి ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు మహిళా సంఘాల జేఏసీ నేతలు మంగళవారం లగచర్లకు బయల్దేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై మహిళా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.