
Simhachalam
Simhachalam : శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో నేడు (శనివారం) గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభం కానుంది. అందుకు ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఏడాది ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు ఈ గిరి ప్రదక్షిణ చేపడతారు. ఈ గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది పాల్గొని స్వామివారి సేవలో తరిస్తుంటారు. ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం మరికొన్ని గంటల్లో అనగా నేడు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాబోతుంది.
కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. సింహాచలం దేవస్థానం తొలి పావంచ, అడవివరం, అప్పుఘర్, లుంబిని పార్కు, సీతమ్మధార, కైలాసపురం, మాధవధార మాధవ స్వామి దేవాలయం పరిసరాలు, గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు. ఈ ప్రదక్షిణలో పౌర్ణమినాడు నిండు చందమామను పోలిన స్వామి పరిపూర్ణ రూపాన్ని దర్శించుకుంటే మనసులోని కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.