Red Ants Chutney : మనకు పచ్చళ్లు అంటే గొంగూర, ఆవకాయ, టమాటా, ఉసిరి.. అఖరికి చికెన్ చట్నీ, మటన్ చట్నీ, చేపల చట్నీ తెలుసు. కానీ మీరెప్పుడైనా ఎర్రచీమల చట్నీని ట్రై చేశారా? కనీసం తిన్నారా?. అబ్బో.. చీమల చట్నీ ఏంటండి బాబూ అని వోక్ వోక్ అనకండి.. ఎర్రచీమల చట్నీ మన పొరుగు రాష్ట్రం ఒడిశాలో ఎంతో ఫేమస్ తెలుసా? అక్కడే కాదు చత్తీస్ గడ్ లో కూడా విపరీతంగా తింటారట.
జీఐ ట్యాగ్ సైతం..
ఒడిశాలోని మయూర్ గంజ్ ప్రాంతం ఎర్ర చీమల చట్నీకి పేరుగాంచింది. ఈ చట్నీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే జనాలు అక్కడికెళ్లి లొట్టలేసుకుంటూ తింటున్నారు. రుచికి రుచి, హెల్త్ కు హెల్త్ కాబట్టే మయూర్ భంజ్ రెడ్ యాంట్ చట్నీకి జీఐ(జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించింది.
ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ తో పాటు జిల్లాలోని ప్రతీ బ్లాక్ ఏరియాలోని అడవుల్లో ఎర్రచీమలు ఏడాది పొడవునా కనిపిస్తాయి. వీటితోనే ఇక్కడి ప్రజలు పచ్చడి చేస్తారు. వీరు తయారు చేసే ఈ చట్నీకి భిన్నమైన గుర్తింపు రావడంతో జీఐ ట్యాగ్ కూడా వచ్చింది. ఇక నుంచి ఈ చట్నీకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించబోతోంది.
రోగాలు దరిచేరవు..
ఈ చట్నీలో ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ బి-12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, అమినో యాసిడ్ లు పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పోషకాలను తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని చెబుతున్నారు. కరోనా కాలంలో చాలా మందిని ఈ చట్నీ ఆదుకుందట. వైద్య పరమైన లక్షణాలతోనే ఈ చట్నీ అందరినీ ఆకట్టుకుంటోంది. జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిని తగ్గించడం, కంటిచూపు, కీళ్ల నొప్పులు, మెదడు ఆరోగ్యానికి చీమల చట్నీ బాగా పనిచేస్తోందని చెబుతున్నారు. వీటి నుంచి తయారు చేసిన సూప్ తోనూ మంచి ప్రయోజనాలే ఉన్నాయి.
ఎలా తయారు చేస్తారంటే..
చాలా ఈజీగా ఈ చట్నీని తయారు చేస్తారు. ఎర్రచీమలను వాటి గుడ్లతో పాటు గూళ్ళ నుంచి సేకరించి శుభ్రం చేస్తారు. తర్వాత ఉప్పు, అల్లం, వెల్లుల్లి, కారం కలిపి గ్రైండ్ చేయడం ద్వారా చట్నీ తయారైపోతుంది. ఈ చట్నీ కొంచెం కారంగా, కొంచెం పుల్లగా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందట. ఈ చట్నీ మలేరియా, కామెర్లు తదితర రోగాలను కూడా నయం చేస్తుందట. ఇక కొసమెరుపు ఏంటంటే.. కొలంబియా, మెక్సికో, బ్రెజిల్ లోనూ చీమలను ఆహారంగా స్వీకరిస్తారు.