IIT Seat : కొందరికి చదువులో అత్యుత్తమ ప్రతిభ ఉంటుంది. బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు వారిలో కొందరికి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా ఉండవు. దీంతో వారి ప్రతిభ ప్రశ్నార్థకంగా మారింది. ప్రతిభ ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో వారి కలలు కల్లలుగా మిగిపోతాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గిరిజన యువతికి ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలో సీటు వచ్చినా చదువు కొనసాగించే పరిస్థితి లేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మేకల కాపరిగానే మిగిలిపోయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనె నాయక్ తండాకు చెందిన బాదావత్ రాములు-సరోజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిది నిరుపేద కుటుంబం. అయితే రాములు తన ముగ్గురు కూతుళ్లను చదివించాడు. పెద్ద కుమార్తెలిద్దరూ డిగ్రీ వరకు చదివి తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తున్నారు. మూడో కూతురు మధులోత చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. జేఈఈ మెయిన్‌లో ఆమె అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో 824వ ర్యాంకు వచ్చింది. మధులితకు ఐఐటీ పాట్నాలో సీటు వచ్చింది. తన కల నెరవేరనుందని మధులత సంతోషించింది.
ఎస్టీ విద్యార్థిగా ట్యూషన్ ఫీజు మినహాయించినప్పటికీ.. జూలై 27లోగా హాస్టల్, ఇతర ఖర్చులకు రూ. 3 లక్షలు చెల్లించాలి. అంత డబ్బు తన వద్ద లేదని తండ్రి రాములు చేతులెత్తేశాడు. దీనికితోడు ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆ కుటుంబం మరింత కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో కుటుంబ పోషణ కోసం మధులత కూడా మేకల కాపరిగా మారింది. మధులత పరిస్థితిపై ఆమె ఉపాధ్యాయుడు, గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల లెక్చరర్ బుక్య లింగం నాయక్ విచారం వ్యక్తం చేశారు. చదువులో రాణిస్తున్నా డబ్బు లేకుండా ఉన్నత చదువులు చదవలేకపోతుందని వాపోయారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న అసమానతలకు ఆమె పరిస్థితి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఐఐటీ ఫీజులతో పాటు రాష్ట్రంలోని రెగ్యులర్ డిగ్రీ కళాశాలలో చదివేందుకు కూడా కుటుంబం స్థోమత లేదన్నారు. దాతలు ముందుకు వచ్చి మధులతను ఆదుకోవాలని కోరారు.
గిరిజన విద్యార్థి సమస్య పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె చదువుకు 1.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె కష్టాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. తన చదువుకు సంబంధించిన ఖర్చులను తానే చూసుకుంటానని ట్విట్టర్‌లో వెల్లడించారు. కేటీఆర్ సాయం చేస్తామని ప్రకటించడంపై మధులత సంతోషం వ్యక్తం చేశారు. వారి సహకారంతో తన కల నెరవేరుతుందని ఆనందబాష్పాలు రాల్చారు.