Vidadala Rajini : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎటూ చూసినా ఎన్నికల వాతావరణమే కనపడుతోంది. ప్రత్యర్థులపై విరుచుకుపడడమే కాదు స్వపక్షం నేతలపై ఆరోపణలు, విమర్శలు పెరుగుతున్నాయి. సీటు రాని నేతలు పార్టీల అధినేతలను, ప్రధాన నేతలను దుయ్యబడుతున్నారు. తాజాగా వైసీపీలో ఈ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల పేరిట పార్టీ ఫండ్ తో పాటు కొంతమంది నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడు ఏకంగా మంత్రి విడదల రజినిపై సంచలన ఆరోపణలు చేశారు. చిలకలూరిపేట టికెట్ ఇప్పించేందుకు తన వద్ద నుంచి రూ.6.5కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. దీంతో వైసీపీలో వరుసగా విడుదలవుతున్న జాబితాల వెనక భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు వైసీపీ 13 జాబితాలు విడుదల చేసింది. దాదాపు 80మంది వరకు సిట్టింగ్ లను మార్చింది. అయితే ఒక జాబితాలో పేరు ప్రకటించి..తదుపరి జాబితాలో మార్చుకుంటూ పోతోంది. ఇప్పటికే ఇన్ చార్జులకు క్షవరం అవుతోందని అంటున్నారు. నేతలకు కమీషన్ల పేరిట కోట్లలో వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. తీరా టికెట్ లేదని చెప్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ బాధితుల జాబితాలో చిలకలూరిపేటలో మల్లెల రాజేశ్ నాయుడు ఉన్నారు.
మంత్రి రజిని ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. ఆమె స్థానంలో మల్లెల రాజేశ్ నాయుడిని నియమించారు. అప్పట్లోనే ఈ విషయమై అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన వద్ద రూ.20కోట్లకు పైగా వదిలించారని సమాచారం. తనకు జరిగిన అన్యాయంపై ఆయన కార్యకర్తల సమావేశం పెట్టుకుని మరీ బాధపడ్డారు. అంత ఖర్చు పెట్టిన ఆయన స్థానంలో వేరే వ్యక్తిని ఇప్పుడు ఇన్ చార్జిగా నియమించారు. ఇలాంటి బాధితుల్లో రాజేశ్ నాయుడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారని అంటున్నారు.