PV Narasimha Rao : పీవీ నరసింహరావు..ఈ పేరు భారత ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. దేశానికి 9వ ప్రధానిగా ఆయన చేపట్టిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పాయి. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అపర చాణక్యుడు ఆయన. దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడే కాదు వివిధ రంగాల్లో ఆయన ప్రతిభ శిఖరాగ్ర సమానం. బహుభాషావేత్త, రచయిత, ఆధ్యాత్మిక వేత్త, చింతనాపరుడు..ఇలా ఆయన ప్రతిభకు అంతేలేదు. 1957లో ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రారంభించిన పీవీ, ఏపీ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఆతర్వాత ప్రధానిగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సంఖ్యాబలం లేకున్నా ఐదేండ్ల పాటు నడిపించిన అపర చాణక్యుడు ఆయన.
1991లో ఆయనకు ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991లో సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా, దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ కు పార్టీ నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడిగా కనపడ్డారు. దాదాపు వానప్రస్థం తీసుకున్నా ఆయన తిరిగివచ్చి ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక సాటి తెలుగువాడు ప్రధాన మంత్రి పదవి చేపడుతున్నారని తెలిసి టీడీపీ అధినేత ఎన్డీఆర్ ఆయన పోటీ పెట్టలేదు. దీంతో పీవీ నంద్యాల నుంచి ఎంపీగా గెలిచారు. ఇక ఆ తర్వాత ప్రధానిగా ఆయన సేవలు దేశాన్ని ప్రపంచ పటంలో ఓ అద్భుత దేశంగా తీర్చిదిద్దాయి. ఆయన దక్షిణాది నుంచి తొలి ప్రధాని కావడం మన తెలుగువారికి ఎంతో గర్వకారణం.
అలాంటి అపర మేధావి పీవీని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని చాలా మందిలో ఆవేదన ఉంది. కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు తెచ్చిన గాంధీ కుటుంబయేతర ప్రధానిగా, గొప్ప వ్యక్తిగా గాంధీ కుటుంబంతో పాటు వారి అనుచర కాంగ్రెస్ నాయకులు పీవీ గొప్పతనాన్ని ఏనాడూ కీర్తించలేదు సరికదా కనీసం గౌరవించలేదు. కనీసం ఆయన చనిపోయిన నాడు ఢిల్లీలో అంత్యక్రియలు పార్టీ తరపున చేయలేదు. దీంతో ఆయన పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తీసుకొచ్చి ఆయన అంత్యక్రియలు చేశారు. కనీసం ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ అగ్రనేతలు ఆయనకు నివాళి కూడా అర్పించలేదు. కాంగ్రెస్ పార్టీ తరుపున కనీసం సంతాపసభ కూడా పెట్టలేదు.
ఇదిలా ఉంటే పీవీ మరణం తర్వాత 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంది. అయినా కూడా పీవీ దేశానికి చేసిన అద్భుత సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వలేదు. ఆ గౌరవానికి ఆయన అన్ని విధాలా అర్హుడు. అయిన కూడా భారతరత్న ఇవ్వలేదు. కనీసం ఆయన దేశానికి, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను ఏనాడూ సభల్లో కొనియాడలేదు. ఇది తెలంగాణ ప్రజలనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాలను బాధించింది. దీంతో పీవీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది.
ఎట్టకేలకు దశాబ్దాల తర్వాత మోదీ ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించింది. బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతరత్న ప్రకటించిన ఏకైక వ్యక్తి పీవీ మాత్రమే. ఇది ఆయన ఘనత. పీవీకి భారతరత్న ఇవ్వకుండా తెలుగు ప్రజల మనస్సులు గెలుచుకునే అవకాశం లేదని తెలిసి ఇచ్చారని కూడా చెప్పవచ్చు. అలాగే పీవీకి భారతరత్న ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని తెలుగు ప్రజల ముందు దోషిగా నిలుపడం కూడా కావొచ్చు. అవన్నీ పక్కకుపెడితే తెలుగువాడికి భారతరత్న వచ్చింది అదే చాలు.
ఇటీవల భారతరత్న పురస్కారాల ప్రదానం రోజున కూడా కాంగ్రెస్ అగ్రనేతలు ఆ వేడుకకు హాజరుకాలేదు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం పీవీ కుటుంబ సభ్యులు భారతరత్న తీసుకుంటుండగా కనీసం ఆయన చప్పట్లు కూడా కొట్టలేదు. ప్రధాని మోదీ సహ అందరూ తమ కరతాళ ధ్వనులతో పీవీకి భారతరత్నపై హర్షం వ్యక్తం చేస్తుంటే ఖర్గే కనీసం పట్టించుకున్నట్టు కూడా లేదు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి తన జీవితాంతం ఎన్నో సేవలు అందించిన పీవీపై కాంగ్రెస్ అగ్రనాయకత్వ తీరుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.