Gas Leak : ఆహారశుద్ధి పరిశ్రమలో గ్యాస్ లీక్.. 17 మందికి అస్వస్థత

Gas Leak

Gas Leak

Gas Leak : మహారాష్ట్ర పుణె జిల్లాలో యవత్ ప్రాంతంలోని ఓ ఆహార శుద్ధి పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 17 మంది కార్మికులు అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. భాండ్ గామ్ లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ రెడీ-టు-ఈట్ యూనిట్ లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ యూనిట్ ను నిత్యం 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంటుంది. అందుకోసం అమ్మోనియా గ్యాస్ ను ఉపయోగిస్తారు. అది ప్రమాదవశాత్తు లీక్ కావడంతో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సమయంలో 25 మంది పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది మహిళలు ఉన్నారు.

గ్యాస్ లీక్ ను గుర్తించిన వెంటనే మెయిన్ రెగ్యులేటర్ ను ఆఫ్ చేసినట్లు సీనియర్ పోలీస్ ఇన్స్ పెక్టర్ నారాయణ్ దేశ్ ముఖ్ తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం 16 మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఓ మహిళకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

TAGS