Minister Lokesh : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఆయనను కలిశారు. తమ పిల్లల్ని అక్కడ చేర్పించి నష్టపోతున్నామంటూ వాపోయారు. క్యాంపస్ గంజాయికి అడ్డాగా మారిందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్.. సమస్యను పరిష్కరించి భవిష్యత్తు కాపాడతానన హామీ ఇచ్చారు. గంజాయిని ప్రోత్సహించే రాజకీయ నాయకులపైన కఠిన చర్యలకు ఆదేశించారు. విద్యాలయాల్లో వాటి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటోందని వివరించారు.
మరోవైపు క్యాంపస్ లో సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని తల్లిదండ్రులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పదో తరగతిలో తమ పిల్లలు 90శాతం పైగా మార్కులు సాధించారని, కానీ ఇంటర్ లో సిబ్బంది ఇంటర్నల్ మార్కుల విషయంలో ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడతానని లోకేశ్ హామీ ఇచ్చారు.