
Vijayawada
Vijayawada : విజయవాడలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసింది. మంగళవారం అర్ధరాత్రి వరంగల్ నుంచి కార్గో వాహనం నడుపుతూ విజయవాడ వస్తుండగా, ఇబ్రహీంపట్నం కూడలి దాటాక ఈ దాడి జరిగింది. విజయవాడ గవర్నర్ పేట డిపో-1కు చెందిన ఆర్టీసీ కార్గో వాహనాన్ని వెంబడించి, కారు అడ్డం పెట్టి డ్రైవర్ సీహెచ్ ఎస్ రావుపై అల్లరిమూకలు దాడి చేశారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. దాడిలో డ్రైవర్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
బాధితుడిని తొలుత విద్యాధరపురంలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం కూడలి వద్ద గంజాయి బ్యాచ్ ఇటీవల పలువురిపై దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.