Gangaputras : పవన్ కోసం ఎదురు చూస్తున్న గంగపుత్రులు.. భవిష్యత్ పై భరోసా కల్పిస్తాడని ఆశ..

pawan

Pawan Kalyan

Gangaputras : సముద్రంలోకి వెళ్లడం.. చేపలు పట్టడం.. అలలతో సహవాసం.. సముద్రంను తల్లిలా భావించడం మత్స్యకారుల జీవితం వినేందుకు.. చూసేందుకు అహ్లాదంగా ఉన్నా.. కష్టాలు మాత్రం వారి వెన్నంటే ఉంటాయి. మత్స్యకారులు సముద్రం ఒడ్డునే గూడు కట్టుకుంటారు. దీంతో పౌర్ణమికి, అమావాస్య రోజు వచ్చే అలలు వారి నివాసాల్లోకి వస్తుంటాయి.

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ సముద్ర తీరం తెలియని వారు ఉండరు. ఒక వైపున సముద్రం, మరో వైపున కొబ్బరి చెట్లు, మధ్యలో రోడ్డు రోడ్డును తాకే అలలు, ఇలా ప్రకృతి అందాన్నంతా ఆ ప్రాంతానికే అప్పగించిందా? అన్నట్లు ఉంటుంది. చూసే వారికి మాత్రం ఇలా ఉన్నా.. ఇక్కడ జీవనం కొనసాగించే మత్స్యకారుల జీవన స్థితి మరోలా ఉంది.

సముద్రాన్ని నమ్ముకొని వేలాది మంది మత్స్యకారులు ఉప్పాడ సముద్ర తీరంలో జీవనం సాగిస్తున్నారు. ఐదు కిలో మీటర్ల సముద్ర తీరం వెంట పూరిపాకలు, కొంతమంది పెంకుటిళ్లు కట్టుకొని జీవనం సాగిస్తారు. మత్స్యకారులంతా సముద్రంలో వేటకు వెళ్తే.. వారి కోసం ఇంటి వద్ద మహిళలు ఎదురు చూస్తుంటారు. ఇదంతా బాగానే ఉన్నా.. రాను రాను సముద్రం ముందుకు వస్తుండడంతో మత్స్యకారుల సమస్యలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.

అలల ధాటికి సముద్ర తీరంలో ఉన్న వీరి నివాసాలు భూగర్భంలో కలిసిపోయాయి. ఆలయాల లాంటివి కూడా సాగర్భంలో కలిసిపోయాయి. ఇది గ్రహించిన ప్రభుత్వాలు మత్య్సకారుల కోసం కొన్ని ప్రాంతాల్లో స్థలాలు కేటాయించినా అక్కడ కూడా సరైన సౌకర్యాలు లేకపోవడంతో మళ్లీ అదే ప్రాంతానికి తిరిగి వచ్చారు. సముద్ర ఘోష, ఆ సముద్రుడి చల్లని చూపు లేనిది జీవించలేమని, పైగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఎలాంటి వసతి లేదని అందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్తున్నారు. భారీ వర్షాలు, అలల తీవ్రత ఎక్కువైతే  నివాసాల్లోకి అలలు వస్తాయని, అప్పుడు బయట ఎక్కడైనా ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు.

ఇప్పుడు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచాడు. డిప్యూటీ హోదాలో కూడా ఉన్నాడు కాబట్టి తమ సమస్యలు తీరుస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. తీర ప్రాంత అలలే నివాసాలకు చేరకుండా రక్షణ కవచం ఏర్పాటు చేయించాలని వారు కోరుతున్నారు. పవన్ వీరి గోడును పట్టించుకుంటారా? వేచి చూడాలి.

TAGS