Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్తున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు నామినేషన్ వేస్తున్నారు. అక్కడి నుంచి బలం ఉన్నందున ఆమె ఎన్నికల లాంఛనమే కానుంది. అంటే ఇక ఆమె రాయ్ బరేలీ నుంచి పోటీ చేయకపోవచ్చన్నమాట. ఇప్పటికే రాహుల్ గత ఎన్నికల్లో అమేథీ సీటును కోల్పోయారు. అదే సమయంలో బ్యాకప్ గా కేరళలోని వయనాడ్ ఎంచుకున్నారు కాబట్టి అక్కడి నుంచి గెలిచి పార్లమెంట్ కు వెళ్లారు. దీంతో ఇప్పుడు ఆయన అమేథీ నుంచి పోటీ చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇప్పుడు రాయ్ బరేలీ నుంచి కూడా సోనియా పోటీ చేయరు. అంటే కాంగ్రెస్ కు సంబంధించి కీలక నేతలు స్థాన చలనం జరుగుతుందన్నమాట.
ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అన్నదానిపై ఇంత వరకు క్లారిటీ లేదు. రాయ్ బరేలీ దశాబ్దాలుగా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన సమయంలో ఫిరోజ్ గాంధీ అక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1977లో ఒక్క సారి మాత్రమే జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించగా.. రాజీవ్ హత్య తర్వాత ఎవరూ గాంధీల కుటుంబ సభ్యులు పోటీ చేయకపోవడంతో 2 సార్లు బీజేపీ గెలిచింది. 1999 నుంచి అక్కడ కాంగ్రెస్సే గెలుస్తుంది. 5 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ గెలిచారు.
ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి రాను రాను తీసికట్టు సున్నం బొట్లుగా తయారవుతోంది. ఈ నియోజకవర్గం పరిధిలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలుడగా.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 4 సమాజ్ వాదీ.. ఒకటి బీజేపీ గెలుచుకున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి ప్రజలు సోనియాకే ఓటేసేవారు. ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అదే సమయంలో సోనియా అనారోగ్యానికి గురైంది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు. అందుకే ఎమ్మెల్యేల ఓటింగ్ ను బేస్ చేసుకొని రాజ్యసభకు వెళ్తున్నారు.