TS Speaker:తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవం
TS Speaker:తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, భారాస ఎమ్మెల్యే, మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్‌తో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు కొత్త స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆయనను స్పీకర్ స్థానం వద్దకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు తోడ్కొని వెళ్లి కేర్చోబెట్టారు.
స్పీకర్ పదవికి ప్రసాద్‌కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం భారాసతో పాటు మజ్లీస్, సీపీఐ నేతలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. అంతకు ముందు పలువురు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణం చేశారు.
ఆ తరువాత భారాస నుంచి కేటీఆర్, పద్మారావు, పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించారు. సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తయిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. ముందు నుంచి ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఉంటే మా సభ్యులెవ్వరూ ప్రమాణ స్వీకారం చేయరని వాదించిన బీజేపీ నేతలు మాత్రం అన్నట్టుగానే ప్రమాణ స్వీకారం చేయకపోవడం గమనార్హం.