TDP : ఏపీలో ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉండడంతో నేతలు బిజీబిజీ అయిపోయారు. టీడీపీలో సీట్ల కోసం హోరాహోరీ పోరు సాగుతోంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా అసెంబ్లీ సీట్లకు ఇప్పుడు భారీగా డిమాండ్ ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావడంతో ఇక్కడ సీట్లకు ఫుల్ గిరాకీ అనే చెప్పాలి. ఇక అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన వైసీపీకి ఈ ప్రాంతంలో నూకలు చెల్లినట్టే అంటున్నారు. అందుకే ప్రతిపక్ష టీడీపీ సీట్ల కోసం అనూహ్యంగా పోటీ పెరిగిపోయింది. నిన్నమొన్నటి వరకూ సైలెంట్ గా ఉన్న నేతలు కూడా యాక్టివ్ అవుతున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఈ మూడు సీట్లపై టీడీపీ భారీ అంచనాలు పెట్టుకుంది. దీంతో టికెట్ల కోసం ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. వీటిలో పెనమలూరు, మైలవరం, తిరువూరు సీట్లు ఉన్నాయి. వీటిలో తిరిగి వైసీపీ గెలిచే పరిస్థితి కనపడడం లేదు. అందుకే టీడీపీ సీట్లకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ఈ మూడు సీట్లలో ఒక్కొక్క సీటుకు కనీసం ముగ్గురేసి సీనియర్ నేతలు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. వీటి కోసం పార్టీ పెద్దల వద్ద లాబీయింగ్ తో పాటు క్షేత్రస్థాయిలోనూ పావులు కదుపుతున్నారు.
పెనమలూరు సీటు కోసం మాజీ బోడే ప్రసాద్ తో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమ, వైసీపీ సిట్టింగ్ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. అలాగే మైలవరం సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమ, బొమ్మసాని సుబ్బారావు ప్రయత్నిస్తున్నారు. అటు తిరువూరు సీటు కోసం ప్రస్తుత ఇన్ చార్జి శావల దేవదత్ తో పాటు అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు, తోకల రాజవర్ధన రావు పోటీ పడుతున్నారు. వీరితో పాటు వైసీపీ నుంచి వచ్చిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గతంలో పోటీ చేసి ఓడిపోయిన జవహర్ వంటి వారి పేర్లు కూడా వినపడుతున్నాయి.
దీంతో ఈ మూడు సీట్లపై టీడీపీ అధిష్ఠానం సర్వేలు చేయిస్తోంది. ఇందులో ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతారో వారికి సీటు ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. మరి సీటు ఎవరి వరిస్తుందో చూడాలి. ఇక్కడ సీటు వచ్చిన వారికి గెలుపు అవకాశాలు ఎక్కువే అని చెప్పవచ్చు.