Revanth Reddy Confidence : తెలంగాణలో ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో ప్రచార పర్వానికి తెర పడనుంది. ఈరేసు ఎవరెవరి మధ్యో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. అయితే ప్రజల మనస్సుల్లో ఏముందో పసిగట్టడంలో పార్టీలన్నీ విఫలమైనట్లే కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలు విజయం తమదే అంటే బహిరంగంగా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఏ ఒక్క పార్టీ విజయం అంతా ఈజీగా ఏం లేదని కనిపిస్తున్నది. అయితే ఈసారి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం విజయంపై పూర్తి ధీమాతో ఉన్నాడు.
కాంగ్రెస్ విజయంపై ఆయన పూర్తిగా ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నది. గురువారం ఏబీఎన్ ఆర్కే డిబేట్ లోనూ ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇదే ధీమా బీఆర్ఎస్ లో నంబర్ 2 గా కొనసాగుతున్న కేటీఆర్ లో కనిపించలేదనే అభిప్రాయం వినిపిస్తున్నది. రేవంత్ రెడ్డి మాత్రం డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అందరూ రావాలని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యర్థులతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ విజయమైనా అంత ఈజీ కాదు.
ఇక్కడ రైతులు, పింఛన్ దారులు ఎటు వైపు మొగ్గుచూపుతారనేది కీలకంగా ఉంది. వారిలో మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్ వైపే చూసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పోల్ మేనేజ్ మెంట్ మాత్రమే కీలకం. అయితే కాంగ్రెస్ చీఫ్ ఏ ధీమాతో బీఆర్ఎస్ ను కొట్టేశామో మాత్రం చెప్పలేకపోతున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక నేతలపై వ్యతిరేకతను నమ్ముకొని ఆయన కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఏదేమైనా తనపై 89 కేసులు పెట్టారంటూనే, బీఆర్ఎస్ పై దూకుడుగా రాజకీయం చేస్తున్నది తానొక్కడినేనని చెప్పకనే చెప్పారు. కానీ రాజకీయ ఫలితాలు ఒక్కోసారి ఊహించడం కష్టం. ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత కామన్. కానీ అక్కడ కేసీఆర్ రాజకీయ చతురత ముందు అది పని చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే రాజకీయంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నేటి నుంచి ఢిల్లీ అగ్రనేతలు సైతం తెలంగాణలో మకాం వేయబోతున్నారు.
ఏదేమైనా ఈసారి తెలంగాణలో పోరు మాత్రం గతంలో మునుపెన్నడూ చూడనంత రసవత్తరంగా సాగుతున్నది. కాంగ్రెస్ ఇంత మైలేజీ సాధించడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత ఒకటైతే, అధికార పార్టీని ధూకుడుగా ఎదుర్కొనే ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డి ఒక్కడే అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. రేవంత్ రెడ్డికి రాష్ర్టం మొత్తం అభిమానులు, అనుచరులు లేరు. కానీ ఆయనంటే కొందరిలో ఒక రకమైన దూకుడు స్వభావం గల నేత అనే భావన ఉంది. కొండ లాంటి బీఆర్ఎస్ ను ఒంటిచెత్తో ఎదుర్కొంటున్నాడు అనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కనుక విజయం సాధిస్తే, ఇందులో ఆయన పాత్రనే కీలకం కాబోతున్నది. ఆయన చెప్పినట్లు డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రమాణ స్వీకార సభ ఉంటే మాత్రం, రేవంత్ రెడ్డి పేరు మరికొన్నాళ్లు మార్మోగే చాన్స్ ఉంటుంది. అది కూడా పార్టీలోని సీనియర్లు పూర్తిగా సహకరిస్తేనే సాధ్యమవుతుంది.