Lavu Sri Krishna Devarayalu : ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

Lavu Sri Krishna Devarayalu
Lavu Sri Krishna Devarayalu : ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 90% సీట్లు ఎన్డీయే కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతి, పోలవరం, కేంద్ర విద్యా సంస్థల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన టీడీపీ తరపున మాట్లాడారు.
గత పదేళ్లుగా రాష్ట్రం రెవెన్యూ లోటు మొత్తాన్ని ఇప్పుడైనా ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరారు. ప్రస్తుతం రాష్ట్రం రూ.13.5 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తోందని వివరించారు. గత అయిదేళ్లలో తెచ్చిన రుణాలతో కొత్తగా ఒక్క మౌలిక వసతి కూడా కల్పించలేదన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రధాని, కేంద్ర మంత్రులు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి జల్ శక్తి మంత్రి దృష్టి సారించాలని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలని, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని శ్రీకృష్ణదేవరాయలు కోరారు.