JAISW News Telugu

Andhra Politics : ఏపీలో కప్పల తక్కెడ రాజకీయం : వైసీపీలోకి నాని.. టీడీపీలోకి పార్థసారధి.. జనసేన వైపు రాయుడు

Andhra Politics 2024 : ఏపీలో చలిమంటలు వేసుకోకుండానే రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. రాజకీయ పార్టీల అధినేతలు ఒకరికి మించి మరొకరు ఎత్తుగడలు, వ్యూహాలతో పట్టుబిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటునుంచి అటు.. అటు నుంచి ఇటు అన్నట్టుగా రాజకీయ నాయకుల పరిస్థితి తయారైంది. ఎవరూ ఏ పార్టీలో కొనసాగుతారో..ఏ పార్టీలోకి వెళతారో తెలియకుండా ఉంది. ఎన్నికల నాటికి ఇది మరింత ముదిరేలా ఉంది.

వైసీపీలో అభ్యర్థుల మార్పులు, చేర్పులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాదాపు 40మంది సిట్టింగులను ప్రజల్లో ఆదరణ లేదనే కారణంతో జగన్ పక్కకు పెట్టేస్తుండడం లేదంటే ఎంపీలుగా పోటీ చేయాలని ఆదేశిస్తుండడంతో వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొందరు అదేపార్టీలో ఉంటూ పరిస్థితులను బట్టి మెదులుదాం అనుకుంటుండగా మరికొందరు మాత్రం టీడీపీ, జనసేనల్లోకి జంప్ కావడానికి రెడీ అయిపోయారు.

టీడీపీలోకి పార్థసారధి..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ మార్పులు, చేర్పుల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే ఈ జిల్లా వైసీపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకున్నా.. పెనమలూరు సీటుపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎంవోలో మంతనాలు జరిపినా ఈ విషయంలో మాత్రం కొలిక్కిరావడం లేదు.  పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధిని మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. ఆయన దానికి ఇష్టపడడం లేదు. మంత్రిగా తనకు అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తితో పాటు ఈసారి వైసీసీ అధికారంలోకి రావడం కష్టమేనన్న ఆలోచనలో ఉన్న పార్థసారధి టీడీపీలోకి వెళ్లేందుకు ఫిక్స్ అయ్యారు. నిన్న రాత్రి టీడీపీ ఎమ్మెల్యే వెలగంపూడి రామకృష్ణతో ఆయన చర్చించినట్టు సమాచారం. ఈనెల 18న గుడివాడలో జరిగే చంద్రబాబు సభలో పార్థసారధి టీడీపీలో చేరుతారని తెలుస్తోంది.

వైసీపీలోకి కేశినేని..

ఇటీవలే టీడీపీని వీడిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. స్వతంత్రంగా పోటీచేద్దామని ఆయన భావించినా.. వైసీపీలో చేరితే గెలుపు ఖాయమని ఆయన భావించారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం జగన్ తో చర్చించారు. విజయవాడ టికెట్ కేటాయిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో నాని వైసీపీలో చేరడం ఇక లాంఛనమే. ఇదే సమయంలో నాని కుమార్తె శ్వేతకు కూడా సీటు ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది.  ఆమెను పెనమలూరు నుంచి పార్థసారధి టీడీపీలోకి వెళ్లిపోతే.. ఆయన స్థానంలో శ్వేతను బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. అలాగే కేశినేని నాని చేరికతో పాటు ఆయన అనుచరుల చేరిక సందర్భంగా భారీ ఎత్తున విజయవాడలో బహిరంగ సభ నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది.

జనసేనలోకి రాయుడు..

వైసీపీలో చేరిన పది రోజులకే  ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ క్రికెటర్ రాయుడు ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు చర్చించారు.  వీరిద్దరి చర్చల తర్వాత జనసేనలోకి రాయుడు చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కాపు సామాజికవర్గానికే చెందిన రాయుడిని ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేదానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే రాయుడు గతంలో ఆశించిన గుంటూరు ఎంపీ సీటు ఇస్తారా? లేదా మరే ఇతర సీటు కేటాయిస్తారా? అన్న చర్చ జరుగుతోంది.

ఇలా ఏపీలో ఒక్క రోజులోనే రాజకీయాలు మారిపోతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ నాటికి జంపింగ్ లు రికార్డు స్థాయిలో జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. నేతల తీరును చూసి జనాలు మాత్రం ఎన్నికలు కప్పల తక్కెడలా మారిపోయాయని, గోడమీద పిల్లి వైనం అయిపోయాయని ముక్కున వేలేసుకుంటున్నారు. అప్పటి దాక తిట్టిన నాయకుడినే పొగడడం.. అప్పటిదాక పొగిడిన నాయకుడిని తిట్టడం సర్వసాధారణమై పోయిందని అంటున్నారు.

Exit mobile version