Pothina Mahesh : ఏపీలో బురద రాజకీయం నడుస్తోంది. అప్పటి దాక జై కొట్టిన నాయకులు ఎమ్మెల్యే సీటు రాలేదనే అక్కసుతో అధినేతలపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఒక పార్టీలో పనిచేసినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ఓపిక ఉండాలి.. కొన్ని త్యాగాలు కూడా చేయాలి. అలాంటప్పుడే జనాల్లో వ్యక్తిగత పేరుతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పదవులు కూడా వరిస్తాయి. కానీ ప్రస్తుతం కొందరు నేతలు ఒక పార్టీ నుంచి సీటు రాదు అని తెలిసిన మరుక్షణమే ఇతర పార్టీల్లోకి ప్యాకేజీలు తీసుకుని జంప్ అయిపోయి గత పార్టీ అధినేతపైనే బురద చల్లడానికి వెనకాడడం లేదు.
ప్రస్తుత రాజకీయాల్లో విలువలు గట్రా లేవనడానికి ఏపీలోని కొందరు నాయకులను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఈ కోవలో అగ్రగణ్యుడిగా పోతిన మహేశ్ ను చెప్పుకోవచ్చు. మొన్నటిదాక జనసేన పాట పాడి.. పవన్ కల్యాణ్ కు జై కొట్టిన ఈయన.. సీటు రాలేదనే అక్కసుతో వైసీపీలో చేరి..తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదువుతూ పవన్ పైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ డ్రామా అంతా జనాలు గమనిస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో ఎవరు ఎలాంటివారు అనేది ప్రజలకు బాగా తెలుసు.
ఈక్రమంలో తాజాగా పోతిన మహేశ్..జనసేనాని పవన్ కల్యాణ్ పై లేనిపోని ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను చూసి జనం నవ్విపోతున్నారు. ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని ఆణిముత్యాలు ఏంటో చూద్దాం.. టీడీపీని బలోపేతం చేయడానికే పవన్ పనిచేస్తున్నారని, చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారని పునరుద్ఘాటించారు. జైలులో చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ కొన్న ఆస్తుల వివరాలు బయటపెడ్తానని కూడా చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్ లో పవన్ కు ఎంత ముట్టిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి వసూలు చేసిన చందాలెంతో చెప్పాలన్నారు. అందులో రైతులకు ఇచ్చింది ఎంత? పవన్ వెనకేసున్నది ఎంత? అని కూడా ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ కు స్పోర్ట్స్ కారు కొనేందుకు పది కోట్లు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏ ఎజెండాతో పార్టీ పెట్టారని నిలదీశారు.
అయితే పోతిన మహేశ్ ప్రశ్నలపై సగటు జనసైనికులు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ గురించి తెలియని ఆంధ్రుడు ఉండరని, ఆయన సినిమాల్లో వచ్చిన డబ్బులను పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పారు. పవన్ పెద్ద స్టార్ గా 25 ఏండ్లకు పైబడి సినిమాలు చేస్తున్నారని, ఆయన డబ్బుల కోసం పాకులాడుతారా అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇస్తున్నారు. కొత్త హీరోలే కోట్లు సంపాదిస్తుంటే తెలుగు ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ పైసల కోసం పార్టీ పెడుతారా అని పోతిన మహేశ్ కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇక నాదెండ్ల మనోహర్ కుటుంబం దశాబ్దాలు కిందటే రాజకీయాల్లో ఉందని, ఆయనకు పైసలకు కొదువ ఏముందని అంటున్నారు. జబర్దస్త్ లో యాంకరింగ్ చేసేవారు కోట్ల రూపాయల విలువ చేసే కార్లు మెయింటెన్ చేస్తుంటే.. మాజీ సీఎం కొడుకు ఓ కారు కొనుక్కోవడం కష్టమా అంటూ పోతినకు కౌంటర్ ఇచ్చారు. పోతిన మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని, వైసీపీ వారు ఇచ్చిన ప్యాకేజీకి ఆశపడే పవన్ పై అభాండాలు వేస్తున్నారని, ఆయన మాటలను ఒక్కరు కూడా పట్టించుకోరని జనసైనికులు అంటున్నారు.