BJP Strategy : ఏపీలో బీజేపీ కొత్త తరం స్ట్రాటజీ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆప్ కీ బార్ 400 పార్’ స్లోగన్ ను ప్రధాని మోడీ ఇటీవల లోక్‌సభ వేదికగా ప్రకటించారు. దీనిలో భాగంగా ఏపీలో 25 సీట్లపై గురి పెట్టింది బీజేపీ. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా అన్నీ తమ కూటమి ఖాతాలోకే రావాలని బీజేపీ రాజకీయం మొదలు పెట్టింది. టీడీపీతో పొత్తు సంకేతాలిస్తూనే.. జగన్ తో స్నేహం కొనసాగిస్తోంది. రెండు పార్టీలు ఎన్డీయేకు అవసరం. ఈ తాజా సమీకరణాలు ఏపీలో ఎవరికి కలిసి వస్తాయి.
పొత్తు లెక్కలు..
బీజేపీ ఏపీలో రాజకీయం మొదలు పెట్టింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. 2019లో టీడీపీ నాడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. తిరిగి ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతోంది. టీడీపీ బయటకు వచ్చినప్పటి నుంచి జగన్ ఎన్డీయేకు దగ్గరయ్యాడు. 2019 విజయం తర్వాత కేంద్రంలో ముఖ్య నేతలతో సత్సంబంధాలు కొనసాగించారు. అవసరమైన సమయంలో కేంద్ర నిర్ణయాలకు మద్దతిచ్చారు. దీనికి కేంద్రం కూడా ఆయనకు మద్దతిచ్చింది. ఇప్పుడు ఏపీలో టీడీపీతో పొత్తు దిశగా బీజేపీ అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో జగన్ తోనూ సంబంధాలు కొనసాగిస్తోంది.
బీజేపీ రాజకీయం..
చంద్రబాబుతో అమిత్ షా చర్చల తర్వాత ఢిల్లీ నుంచి జగన్ కు పిలుపు అందింది. ప్రధానితో జగన్ సుదీర్ఘ భేటీ కొనసాగింది. ఇద్దరిలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా కూటమి నుంచి వెళ్లకుండా ముందస్తు చర్యలు ప్రారంభించింది బీజేపీ రాజ్యసభలో ప్రస్తుత ఎన్నికల్లో 3 స్థానాలు వైసీపీ గెలిస్తే రాజ్యసభలో వైసీపీకి బలం 11కు చేరుతుంది.
మూడో సారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం. రాజ్యసభలో టీడీపీ పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితి ఉంది. సొంతంగా ఎన్ని సీట్లు గెలిచినా అవి బోనస్ కిందే ఉంటాయని బీజేపీ అనుకుంటుంది. మిగిలిన సీట్లలో 2 పార్టీల్లో ఎవరు గెలిచినా తమకు మద్దతుంటుందనేది బీజేపీ అంచనా.
ఎవరికి కలిసొచ్చేను..
ఈ సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీల ఓట్లు కోల్పోతామన్న భయం టీడీపీని వెంటాడుతోంది. జగన్ ఓట్ బేస్ విరుద్దం. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ నాడు ఎన్డీయే నుంచి ఎందుకు బయటకు వచ్చింది.. ఇప్పుడు ఎందుకు చేరుతుంది.. వివరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పొత్తు పెట్టుకుంటే బీజేపీ, జనసేనకు సీట్లు కేటాయిస్తే టీడీపీ మెజార్టీ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నికల సమయం సమీపిస్తోంది. బీజేపీతో పొత్తుతో జగన్ అమలు చేస్తున్న సమీకరణాలకు ధీటుగా సీట్లు కేటాయించే అవకాశాలు చంద్రబాబుకు రాను రాను సన్నగిల్లుతున్నాయి. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే జగన్ ఒక్కరిపైన ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయనే ప్రచారం మొదలైంది. దీంతో, బీజేపీ తమకు లాభం కలిగేలా ఏపీలో రాజకీయం చేస్తుంది.