World Press Freedom Day : ప్రభుత్వాల విధి,విధానాలు ప్రజలకు తెలియజేసేది ప్రచార సాధనాలు. ప్రజల సమస్యలు ప్రభుత్వాలకు పేలిపేది కూడా ఆ సాధనాలే. ప్రభుత్వాలు చేసిన తప్పులను ఎండగట్టేది, అధికారుల తప్పుడు నిర్ణయాలను బహిరంగంగా ప్రజలకు వివరించేది కూడా పత్రికలు, మీడియా సంస్థలు. ఈ సాధనాలు లేకుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉండేది కాదు. అంతే కాదు ప్రజల సమస్యలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే సామెతలా ఉండేవి. ప్రచార సాధనాలు కూడా జనంలో నేడు కొనసాగుతున్నాయంటే ప్రజల మద్దతుతోనే.
పత్రిక స్వేచ్ఛను బతికించేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో యునెస్కో, యూనిసెఫ్ తో పటు పలు సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల ప్రభుత్వాలు పత్రిక స్వేచ్ఛపై ఆంక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి. ఆ నిబంధనలను నిరసిస్తూ అక్కడి జర్నలిస్టులు 1991 లో ఐదు రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. అంతటితో జర్నలిస్టులు ఆగకుండా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి జర్నలిజమ్ ను బతికించుకునేందుకు పలు తీర్మానాలను చేశారు. ఆఫ్రికన్ జర్నలిస్టులు చేసిన నిరసన ఎప్పుడు గుర్తుండేలా ప్రతి ఏటా అంటే మే మూడో తేదీన ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో నిర్ణయించారు. అప్పటి నుంచి ఆఫ్రికా ఖండంలో ప్రతి ఏటా మే 3 తేదీన ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని జర్నలిస్టులు జరుపుకుంటున్నారు.
సమాజంలో పాతుకుపోయిన అక్రమాలు, అవినీతిని బయటకు తీసుకువచ్చే ప్రచార సాధనాల గొంతు నొక్కుతున్న చర్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మాట వినని జర్నలిస్టులను హత్య చేయడం, దాడులు చేసి భయానికి గురిచేయడం దేశంలో ఎదో ఒక చోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశముగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశముగా మన దేశం గుర్తింపు పొందింది. కానీ పత్రికలకు మన దేశం ఇచ్చే స్వేచ్ఛలో మాత్రం వెనుకబడి పోవడం శోచనీయం.
అతి చిన్న దేశాలు కూడా నేడు పత్రిక స్వేచ్ఛ ఇవ్వడము, మీడియా అవసరాలను గుర్తించడంలో మన దేశం కంటే ముందున్నాయి. పలు దేశాల ప్రభుత్వం కనుసన్నల్లోనే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థలు పనిచేయాల్సిన పరిస్థితి ఉండటం విశేషం.