JAISW News Telugu

TSRTC:ప‌ల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం

TSRTC:తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు కొత్తగా కొలువుదీరిన‌ రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. 9వ తేదీ (శ‌నివారం) మ‌ధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో బాలిక‌లు, మ‌హిళ‌లు, ట్రాన్స్ జెండ‌ర్లు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని తెలిపింది. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తామ‌ని అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ఒక‌టి.

ఇచ్చిన హామీ ప్ర‌కారం ప‌ల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బ‌స్సుల్లో మ‌హిళ‌ల ఉచిత ప్ర‌యాణానికి అవ‌కాశం క‌ల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌హిళా ప్ర‌యాణికుల చార్జీ మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించ‌నుంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. గురువారం ప్ర‌మాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖ‌పై క్లారిటీ కోసం ఆయ‌న ఢిల్లీ వెళ్లారు. అంతే కాకుండా మ‌రో ఆరుగురు మంత్రులుగా ఎవ‌రిని నియ‌మించాల‌నే దానిపై కూడా పార్టీ అధిష్టాన పెద్ద‌ల‌తో రేవంత్‌రెడ్డి చ‌ర్చించ‌నున్నారు.

అంతే కాకుండా ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. ఢిల్లీలో పెద్ద‌ల‌ని క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం ఈ రోజు రాత్రే తిరిగి హైద‌రాబాద్ రానున్నారు. రేపు (శ‌నివారం) ఉద‌యం 8:30 గంట‌ల నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సావేశాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేల చేత గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణం చేయించ‌నున్నారు.

Exit mobile version