Autos Bandh : ‘‘వారికి ఉచిత ప్రయాణం..మా ఉపాధికి ఉరికొయ్య’’.. 16న రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్..
Autos Bandh : ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మూడోసారి గెలుస్తామని ఆశపడిన బీఆర్ఎస్ ను గద్దె దించి రేవంత్ సర్కార్ పాలనా బాధ్యతలు తీసుకుంది. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే తాము హామీ ఇచ్చిన వాటిలో రెండింటిని అమలు చేసింది. అందులో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రెండోది ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణం అద్భుత విజయం సాధించిందనే చెప్పాలి. రాష్ట్రంలోని మహిళలంతా బస్సుల్లో ప్రయాణిస్తుండడంతో బస్సులు, బస్టాండ్ లు కళకళలాడుతున్నాయి. బస్టాండ్ ప్రాంగణాలలో వివిధ వ్యాపారాలు పుంజుకున్నాయి. అలాగే బస్సులు 100శాతం అక్యుపెన్సీతో నడువడం విశేషం.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్ల జీవనోపాధికి భారీగా గండికొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమ్యగోచరంగా మారింది. నిరుద్యోగులు, యువకులు, పేద, మధ్యతరగతి, బహుజన కులాల వారే ఎక్కువగా ఆటో డ్రైవర్లుగా తమ బతుకు బండిని నడిపిస్తుంటారు. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటోలను ఎక్కేవారు లేక రోజుకు కనీసం రూ.500లను కూడా సంపాదించలేకపోతున్నామని వారు వాపోతున్నారు. వాస్తవానికి ఆటోలను ఎక్కువగా ప్రయాణించేంది మహిళలే. పురుషులు, యువకులు తమ బైక్ లపైనే ఎక్కువగా ప్రయాణిస్తారు. నూటికి 70 శాతం ఆటోల్లో మహిళలే ప్రయాణిస్తారు. అయితే ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లకు గిట్టుబాటు కాక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపినిచ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు నిన్న రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ను కలిసి సమ్మె నోటీసు అందించారు. బీఆర్ టీయూ, సీఐటీయూ, ఎఫ్ యూటీయూ, ఐఎఫ్ టీయూ తదితర సంఘాలన్నీ మద్దతు ఇచ్చినట్టు టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు.
ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ కు నెలకు రూ.15వేలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని దూకుడుగా కొనసాగిస్తామని హెచ్చరించారు.