Free Schemes : ఏపీలో ఎటూ చూసినా ఎన్నికల వాతావరణమే నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటనలు, బుజ్జగింపులు, మ్యానిఫెస్టో విడుదల..వంటి వాటిపై దృష్టి పెట్టాయి. మ్యానిఫెస్టోలో కొత్త సంక్షేమ పథకాల అమలు చేయడానికి సిద్ధం అవుతున్నాయి. టీడీపీ తన మ్యానిఫెస్టోలో సూపర్ సిక్స్ అంశాలను పొందుపరుస్తోంది. జగన్ ఇప్పటికే పలు ఉచితాల పథకాలను అమలు చేస్తుండగా.. వాటి మొత్తాలను పెంచి మ్యానిఫెస్టో ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో మేధావుల్లో ఉచిత పథకాలపై చర్చ మొదలైంది.
ఉచిత పథకాలపై ఎప్పుడూ చర్చ ఉండేదే. వీటిని కొందరు వ్యతిరేకిస్తారు. మరికొందరు వీటికి మద్దతు పలుకుతారు. ఉచితాలతో ప్రజలను సోమరులు చేస్తున్నారని, దీంతో రాష్ట్రం కుదేలు అయిపోతుందని విమర్శిస్తుంటారు. మరికొందరు ఉచితాలతో ప్రజల కొనుగోలు వ్యయం పెరుగుతుందని, వారికి ఆర్థిక భరోసా కలుగుతుందని అంటుంటారు.
అయితే రెండింటిలోనూ వాస్తవాలు ఉన్నాయి. ఏ పాలకుడైనా ప్రజలకు ఆర్థిక భరోసా ఇవ్వడమే కాదు వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా చూపించాలి. ఒక్క సంక్షేమ పథకాలనే అమలు చేస్తే సరిపోదు. ఆ ప్రజలకు పని చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఉపాధి కల్పన, ఉద్యోగ సృష్టి చేయాలి. రాష్ట్రంలోకి పరిశ్రమలు స్థాపించాలి. సొంతంగా తమ కాళ్లపై నిలబడేందుకు, ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు ఆర్థికంగా సాయం అందించాలి. ఇవన్నీ చేసినప్పుడే ఉచిత పథకాలకు అర్థం ఉంటుంది.
ఏపీ సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనలో చేసింది బటన్లు నొక్కడమే. ఓట్ల కోసమే ఈ యావ తప్ప రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తేలేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. అలాగే యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన చేయలేదంటున్నాయి. రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పన అసలే చేయలేదని అంటున్నాయి. పాలన అంటే సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా అని అంటున్నారు.
పేదల ఓట్లను దండుకోవడం కోసమే సంక్షేమ పథకాల అమలు ఎప్పుడూ మంచిది కాదు. ఈ డబ్బులు నేతలు తమ ఇంట్లో నుంచి ఇవ్వరు అని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి. ప్రజలు కట్టే పన్నులు, వేల కోట్ల అప్పులు తెచ్చి ఉచితాలను నడుపుతున్నారు. ఇవి పరోక్షంగా ప్రజల నడ్డివిరుస్తాయని చెప్పకతప్పదు. ఎవరూ ఉచిత హామీలు ఇచ్చినా వాటితో పాటు అభివృద్ధితో పాటు రాష్ట్ర భవిష్యత్ ను ఆలోచించేవారే నిజమైన పాలకుడవుతాడు. ఏపీకి హైదరాబాద్, బెంగళూర్ లాంటి ఓ రాజధాని, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి కల్పన, మౌలిక వసతుల కల్పన, మహిళలు, చిన్నారుల రక్షణ..ఇలా పాలనలో ఎన్నో ఉంటాయి. వీటన్నంటినీ సరిగ్గా అమలు చేస్తేనే ఆ రాష్ట్రం పురోగమిస్తుంది. ఆ ప్రజల భవిష్యత్ బాగుంటుంది.