Free Heart Operations : చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు..నిమ్స్ కు రానున్న బ్రిటన్ వైద్య బృందం

Free Heart Operations

Free Heart Operations-NIMs Hospital

Free Heart Operations : దేశంలో జబ్బులు పెరిగిపోతున్నాయి. వైద్య సదుపాయాలు బాగానే అభివృద్ధి చెందినా పేదలకు వైద్యం అందని ద్రాక్షే అవుతోంది.  చిన్న పిల్లల నుంచి వృద్ధుల ప్రతీ ఐదుగురిలో ఇద్దరు ఏదో వ్యాధి, జబ్బుతో బాధపడుతూనే ఉంటారు. దేశంలో పేదరికంలో ఉన్నవాళ్లు కోట్లలో ఉన్నారు. వీరికి ఖరీదైన వైద్యం అందదు. ఎంత పెద్ద రోగం వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. అందులో అరకొర సౌకర్యాలతో పేద రోగులు జీవితాలు గాలిలో దీపాలుగా మారిపోయాయి. ఇక ఎందరో చిన్నారులు పుట్టుకతోనే ఎన్నో జబ్బులతో పుడుతున్నారు. కొందరికి పుట్టాక జబ్బులు వస్తున్నాయి. చిన్నారులను వేధించే అతిపెద్ద సమస్య గుండె జబ్బులు. వీటికి వైద్యం అందించాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. అది పేదలకు సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతుంటారు. తీవ్రమైన గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్ వారు  ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ లో వారం రోజుల పాటు చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఈనెల 24 నుంచి 30వ తేదీ దాక నిమ్స్ మిలీనియం బ్లాక్ లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఆస్పత్రి డైరెక్టర్ బీరప్ప. నిమ్స్ లో గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న చిన్నారులకు క్లిష్టమైన ఆపరేషన్లను చేసేందుకు బ్రిటన్ కు చెందిన వైద్య బృందం ఈ నెల 24న హైదరాబాద్ కు వస్తున్నారు.

‘చార్లెస్ హార్ట్ హీరోస్ క్యాంప్’ పేరుతో బ్రిటన్ వైద్య నిపుణులు డాక్టర్ రమణ దన్నపునేని ఆధ్వర్యంలో చిన్నారులకు క్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేయనున్నారు. అప్పుడే జన్మించిన చిన్నారుల నుంచి ఐదేండ్లలోపు వయస్సున్న దాదాపు 10 నుంచి 15 మంది చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయనున్నారు. 10 మంది సభ్యుల బ్రిటన్ వైద్య బృందం నిర్వహించే క్లిష్టమైన ఆపరేషన్లలో నిమ్స్ తో పాటు నిలోఫర్ వైద్య బృందం కూడా పాల్గొంటుంది. మరిన్ని వివరాలకు 040-23489025 నంబర్ కు ఫోన్ చేయవచ్చన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫోన్ లైన్ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

TAGS