JAISW News Telugu

Free Bus Effect : ఫ్రీ బస్ ఎఫెక్ట్ : ప్రజా భవన్ ముందే ఆటోను కాల్చేశాడు..

Free Bus Effect

Free Bus Effect, Auto Fire

Free Bus Effect : ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మూడోసారి గెలుస్తామని ఆశపడిన బీఆర్ఎస్ ను గద్దె దించి రేవంత్ సర్కార్ పాలనా బాధ్యతలు తీసుకుంది. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే తాము హామీ ఇచ్చిన వాటిలో రెండింటిని అమలు చేసింది. అందులో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రెండోది ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణం అద్భుత విజయం సాధించిందనే చెప్పాలి. రాష్ట్రంలోని మహిళలంతా బస్సుల్లో ప్రయాణిస్తుండడంతో బస్సులు, బస్టాండ్ లు కళకళలాడుతున్నాయి. బస్టాండ్ ప్రాంగణాలలో వివిధ వ్యాపారాలు పుంజుకున్నాయి. అలాగే బస్సులు 100శాతం అక్యుపెన్సీతో నడువడం విశేషం.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్ల జీవనోపాధికి భారీగా గండికొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమ్యగోచరంగా మారింది. నిరుద్యోగులు, యువకులు, పేద, మధ్యతరగతి, బహుజన కులాల వారే ఎక్కువగా  ఆటో డ్రైవర్లుగా తమ బతుకు బండిని నడిపిస్తుంటారు. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటోలను ఎక్కేవారు లేక రోజుకు కనీసం రూ.500లను కూడా సంపాదించలేకపోతున్నామని వారు వాపోతున్నారు. వాస్తవానికి ఆటోలను ఎక్కువగా ప్రయాణించేంది మహిళలే. పురుషులు, యువకులు తమ బైక్ లపైనే ఎక్కువగా ప్రయాణిస్తారు. నూటికి 70 శాతం ఆటోల్లో మహిళలే ప్రయాణిస్తారు. అయితే ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లకు గిట్టుబాటు కాక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

ఇప్పటికే ఆటో డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్త బంద్ కు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దేవా అనే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉపాధి కరువైందనే బాధతో ఆటోపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. మహిళలకు ఉచిత ప్రయాణంతో తమకు ఆదాయం తగ్గిపోయిందని విలపించాడు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటోడ్రైవర్లను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నారు.

Exit mobile version