Nagar Kurnool : మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
Nagar Kurnool : నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఏడాది బాలుడు సైతం ఉన్నారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. నాగర్ కర్నూలు మండలంలోని వనపట్ల గ్రామంలో గొడుగు భాస్కర్, పద్మ(28) దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఒక బాబు విక్కి (15 నెలలు), ఇద్దరు అమ్మాయిలు పప్పి (6), వసంత (7) ఉన్నారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
రోజూ మాదిరిగానే ఇంట్లో తిని నిద్రపోయారు. అయితే, ఆదివారం కురిసిన వర్షానికి అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలి తల్లి ఇద్దరు కూతుర్లు, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.