YCP MLA Pinnelli : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐపై దాడి కేసుల్లో రిమాండ్ విధించగా ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు.
నిన్న (బుధవారం) పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం ఎస్పీ కార్యాలయం నుంచి నరసరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరిగి ఎస్పీ కార్యాలయానికి తీసుకు వచ్చారు. ఆ తర్వాత రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఆయనను మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు.
అయితే, ఆయనపై నాలుగు కేసులు ఉండగా న్యాయమూర్తి రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి కేసు, కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై హత్యాయత్నం కేసుల్లో మాత్రం 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు.