Somesh Kumar : తెలంగాణ ప్రభుత్వం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాతో పాటు అటు మేయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోమేష్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆయన తన కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లా కూడా పెరుగుతూ వస్తుంది. అంటే జీహెచ్ఎంసీలో భాగమైనట్లుగానే రంగారెడ్డి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడున్న వేలాది ఎకరాలు కోట్లాది రూపాయలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని యాచారం మండలం, కొత్తపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 249, 260 లలో మొత్తం 25.19 ఎకరాలను సోమేష్ కుమార్ తన అధికారం, పలుకుబడి ఉపయోగించి తన భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని తెలుస్తోంది.
దీనికి సంబంధించి ధరణిలో డాక్యుమెంట్లు బయటపడడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సోమేష్ కుమార్ పై ఎంక్వయిరీని కోరతామని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. సోమేష్ సతీమణి జ్ఞనముద్ర పేరుతో ధరణిలో రిజిస్ట్రేషన్ అయ్యాయని వారు ఆధారాలను చూపిస్తున్నారు.
దీనిపై ప్రభుత్వం విచారణ చేపడితేనే అసలు విషయాలు బయటపడతాయి. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. నాయకులే కాకుండా అధికారులు కూడా ఇలాంటి అవినీతికి పాల్పడితే ప్రజల గతి ఏంటని బీఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై ఎంక్వయిరీ కోరతామని చెప్తున్నారు.