Appalaraju : మాజీ మంత్రి అప్పలరాజు గృహనిర్భంధం
Appalaraju House Arrest : శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఎఫెక్ట్ తో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్టు అయ్యారు. మాజీ మంత్రి, వైసీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అప్పలరాజు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు పలాస-కాశీబుగ్గలు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాశీబుగ్గలో శనివారం జరిగిన రెండు ఘటనలకు సంబంధించి ఆదివారం కార్యకర్తలతో కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లాలని మాజీ మంత్రి అప్పలరాజు ప్రకటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
అయితే, అప్పటికే అక్కడికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బాలికపై తెలుగు యువత పలాస మండల అధ్యక్షుడు ఢిల్లీరావు దాడికి పాల్పడిన ఘటనపై పోక్సో, తమ పార్టీ కార్యకర్తలపై పోలీస్ స్టేషన్ లో దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులు హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం అప్పలరాజును హౌస్ అరెస్టు చేశారు.