Pendyala Krishna Rao : కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణారావు మృతి
Pendyala Krishna Rao : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున కృష్ణబాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం నాడు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, కృష్ణారావు టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
పెండ్యాల జమీందారుల్లో పెండ్యాల వెంకట కృష్ణారావు, ఆయన సోదరుడు అచ్చిబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల రాజకీయాలను మూడు దశాబ్దాల పాటు శాసించారు. వీరు మాజీ ఎమ్మెల్యే, దివంగత ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కు స్వయానా మేనల్లుళ్లు. వీరి సొంత నియోజకవర్గం అయిన కొవ్వూరుతో పాటు పక్కనే రిజర్వుడ్ నియోజకవర్గాలుగా ఉండే పోలవరం. గోపాలపురం నియోజకవర్గాల్లో కూడా వీరు చెప్పినవారికే టీడీపీ అభ్యర్థిత్వాలు దక్కేవి. కొవ్వూరులో పేరుకు మాత్రమే కృష్ణబాబు ఎమ్మెల్యే, చక్రం మొత్తం అచ్చిబాబే తిప్పేవారు. 1983లో ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి 1999 వరకు వరుసగా విజయాలు సాధించిన కృష్ణబాబు ఒసారి సాధారణ ఎన్నికల్లో ఏకంగా 58 వేల ఓట్ల మెజారిటీ సాధించారు.