JAISW News Telugu

Ex DSP Nalini:రేవంత్ రెడ్డి జాబ్ ఆఫ‌ర్..న‌ళిని ఏమ‌న్నారంటే..

Ex DSP Nalini:తెలంగాణ ఉద్య‌మం ఉదృతంగా సాగుతున్న‌ స‌మ‌యంలో ఉద్య‌మ‌కారుల‌పై లాఠీచార్జ్ చేయ‌లేన‌ని డీఎస్పీ న‌ళిని త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి వార్త‌ల్లో నిలిచారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత కూడా ఆమెకు ఉద్యోగం ల‌భించ‌లేదు. ఆమెని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు కూడా. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్‌రెడ్డి ..మాజీ డీఎస్పీ న‌ళిని గురించి ప్ర‌స్తావించారు. ఇటీవ‌ల పోలీస్ రిక్రూట్ మెంట్‌కు సంబంధించిన స‌మీక్ష‌లో పాల్గొన్న సీఎం.. న‌ళినిని తిరిగి విధుల్లోకి ఎందుకు తీసుకోవ‌డం లేద‌ని ఆరా తీశారు.

పోలీస్ శాఖ‌లో ఆమె తిరిగి ఉద్యోగం చేయ‌డానికి నిబంధ‌న‌లు అడ్డొస్తే అదే హోదాలో ఆమెకు మ‌రో శాఖ‌లో ఉద్యోగం ఇవ్వాల‌ని అధికారుల‌కు రేవంత్ రెడ్డి సూచించారు. దీనిపై స్పందించిన న‌ళిని.. సీఎం రేవంత్ రెడ్డికి తాజాగా ఓ లేఖ రాశారు. త‌న‌పై సీఎం చూపించిన అభిమానానికి ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సీఎం ఆత్మీయ‌త త‌న హృద‌యానికి గొప్ప స్వాంత‌న క‌లిగించింద‌ని, త‌న క‌ళ్లు చెమ్మ‌గిల్లాయంటూ భావోద్వేగ లేఖ రాశారు. త‌న‌కు న్యాయం చేయాలంటే ఉద్యోగానికి బ‌దులు త‌న ధ‌ర్మ ప్ర‌చారానికి ఉప‌యోగ‌ప‌డేలా స‌హాయం చేస్తే స్వీక‌రిస్తాన‌ని ఆమె చెప్పారు.

త‌న గ‌తం ఒక రీల్ మాదిరిగా క‌ళ్ల ముందు క‌దులుతోంద‌ని ఆమె గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్య‌మం కోసం డీఎస్పీ ఉద్యోగాన్ని వ‌దులుకుని ఉద్య‌మంలో పాల్గొన్న న‌ళిని ఆ త‌రువాత వార్త‌ల్లో క‌నిపించ‌లేదు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి తొమ్మిదిన్న‌రేళ్లు కావ‌స్తున్నా న‌ళిని గురించి ప‌ట్టించుకున్న వాళ్లు లేదు. గ‌త ప్ర‌భుత్వం కూడా న‌ళిని గురించి ఆలోచించ‌లేదు. ఆమె ఎక్క‌డుంది? ఏం చేస్తోంది? వంటి విష‌యాల‌పై ఆరా తీయ‌లేదు. గ‌త కొంత కాలంగా న‌ళిని ఆధ్యాత్మ‌క మార్గంలో న‌డుస్తున్నారు. య‌జ్ఞ బ్ర‌హ్మ‌గా, వేద ప్ర‌చార‌కురాలిగా మారారు.

Exit mobile version