Former CS Somesh : దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధును అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ ఆలోచన చేసిన సీఎంగా కేసీఆర్ గుర్తింపు పొందారు. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం ‘కిసాన్ సమ్మాన్ యోజన’ పథకాన్ని అమలు చేయడం విశేషం. ఈ స్కీం కింద రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నారు. అర్హులైన ప్రతీ రైతుకు ఈ నగదు నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. అయితే రైతుబంధులో ఉన్న లోపాలతో వందల ఎకరాలు ఉన్న భూస్వాములు, బడాబాబులు కూడా లక్షల రూపాయలు తీసుకోవడంపై మాత్రం విమర్శలు ఉన్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తోంది. దీనిలో ధరణి, రైతుబంధు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భూముల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో తాను కొనుగోలు చేసిన భూములపై ఇప్పటి వరకు రూ.14, 05,550 రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. పంటలు సాగు చేసేందుకు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించింది. సోమేశ్ కుమార్ ఆ భూమిని సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నారని సమాచారం. రెండు పంటలకు కలిపి రూ.2,52,750 చొప్పున రైతుబంధు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఆయన కొనుగోలు చేసిన 25 ఎకరాల 19 గంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. సాగుకు అనువుగా లేకపోయినా.. రైతుబంధు కింద సాయం పొందినట్టు వెల్లడైంది. ఆయన చుట్టుపక్కల సాగుకు అనువు కానీ మొత్తం 150 ఎకరాలకు రైతుబంధు మంజూరైనట్లు తెలిసింది.
రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలోని 25 ఎకరాల భూమిని సోమేశ్ కుమార్ కొనుగోలు చేశారు. 2018లో నలుగురు దగ్గర నుంచి ఈ భూమిని కొన్నట్టు తెలుస్తోంది. అక్కడ ఒక్కో ఎకరం రూ.3 కోట్లు పలుకుతుండగా.. ఎకరాలకు రూ.2లక్షలు మాత్రమే చెల్లించి ఖరీదైన భూమిని కారు చౌకకు దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ భూమిని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయడం వెనక ఏదో జరిగి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది.