Yerneni Sita Devi : గుండెపోటుతో ఏపీ మాజీమంత్రి మృతి
Yerneni Sita Devi : మాజీమంత్రి, విజయా సంస్థ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి మరణించారు. సోమవారం హైదరాబాద్ మియాపూర్ లో గుండెపోటుతో ఆమె మృతి చెందారు. సీతాదేవి ఎన్టీఆర్ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడుమూరు. ఆమె ముదినేపల్లి నుండి టీడీపీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సీతాదేవి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సీతాదేవి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా సీతాదేవి తనదైన ముద్ర వేశారని చంద్రబాబు కొనియాడారు.
యెర్నేని సీతాదేవి మాత్రమే కాకుండా ఆమె కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే కావడం గమనార్హం. ఆమె భర్త నాగేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. నాగేంద్రనాథ్ ఏడాది క్రితం మరణించారు. నాగేంద్రనాథ్, సీతాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.