Andhra Pradesh American Association : తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకై ‘‘ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసొసియేషన్’ ఏర్పాటు
Andhra Pradesh American Association : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధి రిత్యా వేలాది మంది తెలుగు వారు సెటిల్ అయ్యారు. సూదూర ప్రాంతానికి వెళ్లిన ఆంధ్రులు తమ మూలాలను మరిచిపోవడం లేదు. ఎక్కడ ఉన్నా తెలుగు సంప్రదాయాన్ని వదిలిపెట్టడం లేదు. వాస్తవానికి తెలుగు నేలపై ఉన్నవారికంటే కూడా అమెరికాలో ఉన్న వారికి మాతృభూమి మమకారం ఎక్కువ అని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎక్కడో దూరంగా నివసిస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ ముందుకెళ్తున్నారు. దీని కోసం ఎన్నో కొత్త సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసుకుని తమ ఐక్యతను చాటుతున్నారు.
అమెరికాలో ప్రవాసాంధ్రుల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించి బలమైన సామాజిక భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA)ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జూన్ 19న అరిజోనాలోని ఫీనిక్స్(Phoenix)లో ‘ఫీనిక్స్ ఛాప్టర్’ ప్రారంభ సమావేశం నిర్వహించారు. కల్యాణ్ గొట్టిపాటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి దాదాపు 100 మంది ప్రావాసాంధ్రులు హాజరయ్యారు. నాగ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. వాసు కొండూరు తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నాయకత్వ బృందం హరి మోతుపల్లి (వ్యవస్థాపకులు), బాలాజీ వీర్నాల (గవర్నింగ్ బోర్డు), కల్యాణ్ కార్రీ (గవర్నింగ్ బోర్డు), రవి చిక్కాల (గవర్నింగ్ బోర్డు), గిరీష్ అయ్యప్ప (న్యూజెర్సీ చాప్టర్ అధ్యక్షుడు), సత్య వేజ్జు (ప్రెసిడెంట్-ఎలెక్ట్, న్యూజెర్సీ), వీరభద్ర శర్మ (పెన్సిల్వేనియా చాప్టర్ అధ్యక్షుడు), ప్రదీప్ సెట్టిబలిజ (డెలావేర్ చాప్టర్ అధ్యక్షుడు), హరి తూబాటి (డెలావేర్ ప్రెసిడెంట్-ఇలెక్ట్) సంఘం లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను సంరక్షించడం, వాటి ప్రాముఖ్యంపై చర్చలు జరిగాయి. భోగి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి వంటి పండుగలలో ఉన్న ఏకత్వం, కలిసి ఉండాలనే భావనపై ప్రసంగించారు. వీటిని భవిష్యత్తు తరాలకు అందించడానికి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు.
కార్యక్రమంలో కల్యాణ్ గొట్టిపాటి, నాగ, వాసు కొండూరు, జయరాం కోడె, మధు అన్నె, నరేంద్ర పర్వతరెడ్డి, నాగేంద్ర వుప్పర, రమేష్ కుమార్ సురపురెడ్డి, రాజమోహన్ సందెళ్ళ, పుల్లారావు గ్రాంధి, సాయిబాబు, భాను తదితరులు పాల్గొన్నారు.