Forest officials : అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీ అధికారులు ఆదివారం సాయంత్రం చింతూరు మండలం తులసిపాక అటవీ చెక్ పోస్టు వద్ద పట్టుకున్నారు. లక్కవరం అటవీక్షేత్రాధికారి వెంకట నానాజీ తెలిపిన ప్రకారం.. కాకినాడ నుంచి ఒడిశా రాష్ట్రానికి అక్రమంగా కారులో తరలిస్తున్న 246 తాబేళ్లను చింతూరు మండలం తులసిపాక అటవీశాఖ చెక్ పోస్టు వద్ద తనిఖీలలో పట్టుకున్నారు. వాటిలో 230 తాబేళ్లు సజీవంగా, 16 మృతి చెంది ఉన్నాయి.
సజీవంగా ఉన్నవాటిని శబరి నదిలో వదిలిపెడతామని అధికారులు పేర్కొన్నారు. వాటిని రవాణా చేస్తున్న ఒడిశాకు చెందిన సూరజ్ మండల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు. ఈ తనిఖీల్లో లక్కవరం సెక్షన్ అధికారి విజయ్ కుమార్, బీట్ అధికారి బి.సరిత తదితరులు పాల్గొన్నారు.