Nanded-Visakha Express : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఇక ఓటు వేయలేమని భావించిన ఓటర్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు స్పందించిన ఎన్నికల సంఘం ఏకంగా రైలును గ్రీన్ ఛానల్ మార్గంలో వైజాగ్ చేరుకునేలా చేసింది. నాందేడ్-విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (20812) ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు నాందేడ్ లో బయలుదేరి సోమవారం ఉదయ 9.10 గంటలకు విశాఖపట్నం చేరుకోవాలి. అయితే, రైల్వే భద్రతా పనుల కారణంగా దాదాపు 7, 8 గంటల పైగా ఆలస్యంగా నడిచింది. ఆ రైలులో ఓటింగ్ కు వస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు 800 మందికి పైగానే ఉన్నారు.
రైలును ఎక్కడికక్కడ నిలిపి వేస్తుండడంతో ఆ ప్రయాణికుల్లో కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. రైలు ఏడు గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోందని ఇలాగైతే ఓటువేసే అవకాశం కోల్పోతామని అందులో పేర్కొన్నారు. ఆ వీడియో ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. దీంతో సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పందించి విజయవాడ, విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం)లతో మాట్లాడారు.
ఎలాగైనా పోలింగ్ సమయం 6 గంటలకన్నా ముందే విశాఖకు చేర్చాలని ఆదేశించారు. ఆ ఇద్దరు డీఆర్ఎంలు నాందేడ్-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో ఆ రైలు ఆగాల్సిన స్టేషన్లలో మాత్రమే ఆగి, ఎక్కడా క్రాసింగ్ లేకుండా సాయంత్రం 5.15 గంటలకు విశాఖపట్నం చేరింది. దీంతో కొందరు ఓట్లు నగర పరిధిలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు.