Amaravati : అమరావతికి నిధుల వరద.. అభివృద్ధి ఉరుకులు పరుగులే
Amaravati Development : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీవాసుల కలలు నెరవేరనున్నాయి. వారి కలల రాజధాని అమరావతికి నిధుల అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. అటు రుణం రూపంలో కొంత.. ఇటు బడ్జెట్ కేటాయింపుల్లో మరికొంత.. బాండ్లను విక్రయించడం ద్వారా ఇంకొంత సొమ్మును సమీకరించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిధులతో సహా అన్నీ సమకూరేందుకు మార్గం సుగుమం అయింది. అమరావతి పూర్తిస్థాయి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉంది.
తొలి దశలో 50 వేల కోట్లను, మలిదశలో మిగిలిన మొత్తాన్ని సమకూర్చుకుని అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రస్తుత ప్రభుత్వ ప్రణాళిక. దీని ప్రకారమే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కేంద్ర బడ్జెట్లో రూ.15000 కోట్లను ప్రకటించారు. ఇది అప్పు రూపంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇవ్వనుంది. దీనిలోనూ 1400 కోట్ల వరకు కేంద్రం భరిస్తుంది. మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఇలా మొత్తంగా 15000 కోట్లు రానున్నాయి. ఇక, తాజాగా ప్రకటించిన స్వల్ప కాలిక బడ్జెట్(నవంబరు-మార్చి )లో రూ.3445 కోట్లను ప్రకటించారు. ఇవి రాష్ట్ర సొమ్ములు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం నుంచి కేటాయించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతగా హడ్కో సంస్థ నుంచి మరో 12 వేల కోట్ల రూపాయలు తీసుకునేందుకు రెడీ అయింది. హడ్కో కూడా ఇస్తానని చెప్పింది. అంటే.. మొత్తంగా 30 వేల కోట్లకు పైగానే సొమ్ములు వచ్చేందుకు మార్గం సుగమం అయింది.
ఇవి కాకుండా.. రాజధాని బాండ్లను విక్రయించడం ద్వారా.. హ్యాపీ నెస్ట్ భవనాలను విక్రయించడం ద్వారా మరో రూ.23 వేల కోట్లను సమీకరించనున్నారు. అంటే.. మొత్తంగా తొలి దశలో ప్రతిపాదించిన 50 వేల కోట్ల రూపాయలు సమీకరించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నం సఫలం అయింది. అయితే.. ఇవన్నీ ఒక్కసారిగా కాకుండా.. విడతల వారీగా పనులు పూర్తికాగానే వచ్చేస్తాయి. ఎలా చూసుకున్నా.. అమరావతి నిర్మాణానికి రూ.50 వేల కోట్లు సమకూరనున్నాయి.
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో అమరావతిని పట్టించుకోకపోవడంతో ఇక్కడ తుమ్మ, పిచ్చిచెట్లు పెరిగిపో యి.. అడవిని తలపించింది. దీనిని క్లియర్ చేసేందుకు రూ.38 కోట్లను సర్కారు గతంలోనే కేటా యించింది. పనులు కూడా పూర్తవుతున్నాయి. నేడో రేపో.. జంగిల్ క్లియరెన్స్ పూర్తవుతుంది. అనంతరం.. రూ. 3445 కోట్లతో పనులు ప్రాథమికంగా ప్రారంభించనుంది. తర్వాత.. ఒకటి రెండు రోజుల్లోనే ప్రపంచ బ్యాంకు నుంచి 25 శాతం చొప్పున అంటే రూ.3 వేల కోట్లకు పైగానే అందనుంది. దీంతో అమరావతి నిర్మాణాలు పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నా యి.