Flood disaster in Nepal : నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా 39 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 11 మంది గల్లంతైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆకస్మిక వరదలు పోటెత్తడంతో దేశంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని. జనజీవనం స్తంభించింది. వరదలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని విపత్తు ప్రతిస్పందన అధికారులు హెచ్చరిస్తున్నారు.
వరదల ప్రభావంతో ఖాట్మండ్ లో 9 మంది, లలిత్ పూర్ లో 16, భక్త పూర్ లో 5, కవ్రేపాలన్ చౌక్ లో ముగ్గురు, పంచతార్, ధన్ కూటాలో ఇద్దరు, ఝాపా, ధాడింగ్ లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు తెలుస్తోంది. 226 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయని, బాధిత ప్రాంతాల్లో దాదాపు 3,000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు. నేపాల్ సాయుధ పోలీసు దళానికి చెందిన 1,947 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.