JAISW News Telugu

Great Leader NTR : తెలుగు జాతి ఆత్మగౌరవ పతాక..మహా నాయకుడు ఎన్టీఆర్..

Great Leader NTR

Great Leader NTR

Great Leader NTR : తెలుగు జాతి ఆత్మగౌరవ పతాక ఆయన.. ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన మహా నాయకుడు ఆయన.. బడుగు, బలహీన వర్గాలకు పెద్ద దిక్కు ఆయన.. తెలుగు నేల నుంచి ఉద్భవించిన మట్టి మనిషి ఆయన.. ఆయనే ఎన్టీఆర్. తెలుగు జాతి ఉన్నంత కాలం మరిచిపోలేని మహాన్నోత నేత ఎన్టీఆర్. ఇవాళ ఆయన వర్ధంతి(జనవరి 18). ఈరోజు ఆయనను స్మరించుకోని తెలుగు గుండె ఉండదు.

సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎవరూ సొంతం చేసుకోలేని కీర్తి ఎన్టీఆర్ సొంతం. ఇటు భారతీయ సినిమా యవనికపై, అటు రాజకీయ రంగంపై తనదైన ముద్ర వేసిన ఘనత ఎన్టీఆర్ ది. జానపద, సాంఘిక సినిమాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న ఎన్టీఆర్.. సంక్షేమ పథకాలకు ఆద్యుడై పేద జీవులకు కూడు, గుడ్డ అందించిన మానవత్వ పరిమళాలు వెదజల్లిన రాజకీయ నేత ఎన్టీఆర్.

తెలుగు సినిమా శక్తిని భారత దేశ నలుమూలల చాటిన ఎన్టీఆర్ ఎన్నో వైవిధ్య భరిత పాత్రలను పోషించారు. రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీవోడే అని జనం మొక్కిన రోజులవి. దేవుళ్లను మనిషిలో చూసుకున్నారు అనాటి ప్రజలు. కథానాయక పాత్రలే కాదు.. రావణాసురుడు, దుర్యోధనుడి పాత్రను అద్భుతంగా పండించారు ఎన్టీఆర్. ఏ పాత్ర వేసినా ఆ పాత్రకు వందశాతం న్యాయం చేసే నటుడిగా ఎన్టీఆర్ పేరు చరిత్ర లిఖితం. నటుడిగా ఉన్నప్పుడే సామాజిక సోయి ఆయనకే సొంతం. చైనా దురాక్రమణను ఖండించడమే కాకుండా దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు జోలె పట్టి ఊరూరు తిరిగి నిధులు సేకరించి ప్రజలకు అందించిన గొప్ప హృదయం ఆయన సొంతం.

అప్పటి రాజకీయాల్లో తెలుగు వారికి జరుగుతున్న అవమానం.. ఆయనను రాజకీయాల్లోకి రప్పించేలా చేసింది. అప్పటి కాంగ్రెస్ సీల్డ్ కవర్లలో పేర్లు పంపి.. నెలకో ముఖ్యమంత్రిని మార్చే వైఖరిని ఆయన ఖండించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు తానే తెలుగు దేశం పార్టీని స్థాపించి.. 9 నెలల్లో అధికారం కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ స్థాపించి దానికి చైర్మన్ గా ఉన్నారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీని తొలిసారిగా ప్రతిపక్షంగా నిలిపిన ఘనత ఎన్టీఆర్ ది. ఆ చరిత్ర తెలుగు దేశం పార్టీది.

దయ, కరుణ ఉన్న మనిషి ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలో దాదాపు అన్నీ చేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి.. పేదలకు బుక్కెడు అన్నం పెట్టిన మనిషి ఆయన. జనతా బట్టలతో పేదవాడికి చొక్కాలు అందించారు. అలాగే అప్పటి దాక ఒక్క సామాజిక వర్గం రాజ్యమేలుతున్న దశలో బీసీలను అసెంబ్లీలో కూర్చొబెట్టారు. రాజకీయాల్లో చైతన్యానికి ఎన్టీఆరే నాంది పలికారు. ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరున్న రాజకీయ నాయకులుగా, సీఎంలుగా వెలుగొందిన ఎంతో మంది ఆయన శిష్యులే.

స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ఎన్టీఆర్ పేరును ఎవరూ విస్మరించజాలరు. ఇప్పటికీ ఆయన పేరు, ఆయన ఫొటో లేకుండా రాజకీయాలు నడిచే పరిస్థితి లేదంటే.. ఆయన తెలుగు రాజకీయాల్లో ఎంతగా ప్రభావం చూపారో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతులను కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తారు. తెలుగోడు భూమి మీద ఉన్నంత కాలం ఎన్టీవోడి పేరు ప్రతిధ్వనించడం మానదు.

Exit mobile version