BRS : కారు ఖాళీ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే అంటున్న కాంగ్రెస్..

BRS

BRS

BRS : 2023, డిసెంబర్ నుంచి బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూనే ఉంది. ఆ నెలలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఇందులో ప్రజలు పార్టీని, ప్రభుత్వాన్ని మార్చాలని అనుకున్నారు. ‘పదేళ్ల దొరల పాలనకు స్వస్తి చెప్తాం ప్రజాపాలన కొనసాగిద్దాం’, ‘మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి’ అంటూ కాంగ్రెస్ నినాదాలు, కర్ణాటకలో ప్రభుత్వం మార్పు అన్నీ కలిసి వచ్చి బీఆర్ఎస్ కోటను కాంగ్రెస్ బద్దలు కొట్టింది.

ఇక ఎన్నికల్లో తమను ఓడించడం అసాధ్యం అని విర్రవీగిన నేతలను తెలంగాణ ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయారు బీఆర్ఎస్ నాయకులు, అధినేత. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలుకావడంతో మళ్లీ తెరమీదకు వచ్చారు బీఆర్ఎస్ నాయకులు, అధినేత కేసీఆర్.

‘కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలుతోంది. ఆ పార్టీలో చాలా మంది నేతలు తమకు టచ్ లో ఉన్నారు.’ అంటూ కేసీఆర్ మాట్లాడారు. అయితే ఇది నమ్మడం కాదు కదా.. వినడానికే ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు కేసీఆర్. పదేళ్లు సీఎంగా ఉన్న నాయకుడు కుర్చీ కోల్పోయిన నాలుగు నెలలకే ఇలాంటి విమర్శలు చేసి దిగజారుతున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి.

లిక్కర్ కేసులో కన్న కూతురు అరెస్టయి తీహార్ జైల్ లో ఉన్నా, మరో పక్క కొడుకు కేటీఆర్ ఫోన్ టాపింగ్ ఆరోపణలతో రేపో మాపో జైలుకు వెళ్లచ్చన్న  పరిస్థితులు ఉన్నప్పటికీ కేసీఆర్ లో అహంకారం పోలేదని సీఎం రేవంత్ అన్నారు. ‘అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించే ఓపిక లేదు.. కానీ మీడియా ఛానెల్స్ లో 4 గంటల పాటు చర్చలో కూర్చునే ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్’ అంటూ రేవంత్ ప్రశ్నించారు.

అధికారంలో ఉన్నప్పుడు మీడియాను ప్రగతి భవన్ లో అడుగు పెట్టనివ్వని కేసీఆర్ ఇప్పుడు మీడియా దగ్గరకు వెళ్తున్నారంటూ ఆయన నైజం ఇదే నని రేవంత్ అన్నారు. అందితే జుట్టు అందక పోతే కాళ్లు పట్టుకునే రకం కేసీఆర్  ది అన్నారు. ‘మా పార్టీ నేతలు మీకు టచ్ లో ఉండడం కాదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ కారు పార్టీ ఖాళీ అవడం ఖాయం అంటూ ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికే బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు.

TAGS